18-06-2025 12:00:00 AM
ఇళ్లు రాని వాళ్లలో ఆందోళన
ఇందిరమ్మ ఇండ్ల ఆశావహుల్లోవింతపరిస్థితి
మహబూబాబాద్, జూన్ 17 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు మంజూరైన పేదలు ఆనందంతో ఓ వైపు ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అ యితే మరోవైపు తమకు ఇండ్లు మంజూరు చేయకుండా అన్యాయం చేశారంటూ ఇం కొందరు పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా మారింది.
మహబూబాబాద్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, అందులో మహబూబాబా ద్, డోర్నకల్ నియోజక వర్గాలు జిల్లా పరిధిలోనే పూర్తి స్థాయిలో గ్రామాలున్నాయి. ఇక జనగామ జిల్లా పరిధిలో పాలకుర్తి, ఖమ్మం జిల్లా పరిధిలో ఇల్లందు, ములుగు జిల్లా ములుగు నియోజక వర్గ పరిధిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొన్ని గ్రామాలున్నాయి.
గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల జాబితాను తొలి విడతలో ప్రకటిస్తూ, ప్రజా ప్రతినిధుల చేత ప్రొసీడింగ్ కాపీలను అందిస్తున్నా రు. మంజూరు పత్రాలను పొందిన లబ్ధిదారులు ఆనందంతో ఇండ్ల నిర్మాణానికి శ్రీకా రం చుడుతున్నారు.
ఆషాఢ మాసానికి ముందే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసుకోవాలనే అతృతతో అనేక గ్రామాల్లో లబ్ధిదారులు ఇలా ప్రొసీడింగ్ కాపీలను తీసుకున్నారో లేదో అలా ఇంటి నిర్మా ణానికి శ్రీకారం చుడుతున్నారు.
దాదాపు ప్రతి ఎమ్మెల్యే పరిధిలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలను అందజేశారు. గ్రామాల పరిధిలో కాంగ్రెస్ నాయకులు ఎంపికైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తున్నారు. దీనితో గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం సందడిగా మారింది.
అర్హులకు మొండి చేయి?
అయితే అర్హులమైనప్పటికీ తమకు మొదటి విడత ఇండ్లు మంజూరు చేయకుం డా మొండి చేయి చూపుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకుల సిఫారసు ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారంటూ అనేక గ్రామాల్లో పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొన్ని చోట్ల ఇండ్ల మంజూ రులో డబ్బులు వసూలు చేస్తున్నారని, డ బ్బులు ఇచ్చిన వారికే తొలి విడతలో ఇండ్లు మంజూరు చేస్తున్నారంటూ విమర్శలకు దిగుతున్నారు.
ఇంకొన్ని చోట్ల ఇండ్లు ఉన్నవారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. ఫలితంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొందరికి మోదంగా, ఇంకొందరికి ఖేదంగా మారింది.