calender_icon.png 24 October, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేట్రేగుతున్న గన్ కల్చర్!

24-10-2025 12:19:47 AM

  1. నగరంలో పేలుతున్న తూటాలు 

రౌడీ షీటర్లు, స్మగ్లర్లు, రాజకీయ నాయకుల వద్ద అక్రమ తుపాకులు 

బిహారీయుల వద్ద కొనుగోలు 

ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు

మేడ్చల్, అక్టోబర్ 23(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాతో పాటు నగరంలో తుపాకుల కాల్పులు కలకలం రేపుతున్నాయి. తరచూ ఏదో ఒకచోట తుపాకీ కాల్పుల శబ్దం వినిపిస్తోంది. దేశీ వాలి తుపాకులు అక్రమంగా కొనుగోలు చేసి ప్రత్యర్థుల మీద కాల్పులు జరుపుతున్నారు.

వరస సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నా యి. తాజాగా మేడ్చల్ జిల్లాలోని పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గోవులు రవాణా చేస్తున్న వ్యక్తి, గోరక్షకుడిపై కాల్పులు జరపడం కలకలం రేపింది. రౌడీ షీటర్ ఇబ్ర హీం దేశి వాలి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

ఇటీవల మలక్పేటలో చందు నాయక్ ను పాత కక్షలతో ప్రత్యర్థులు తుపాకీ కాలపులు జరిపి హతమార్చారు. ఇవే కాకుండా అనేక సంఘటనలు జరిగాయి. నగరంలో ప్రతి రౌడీషీటర్, స్మగ్లర్ల వద్ద తుపాకులు ఉంటున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చోటా మోటా రాజకీయ నాయకుల వద్ద సైతం అక్రమ తుపాకులు ఉన్నాయి. 

బీహార్ నుంచి అక్రమ రవాణా 

తుపాకులు బీహార్ నుంచి అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీహార్లో తుపాకుల తయారీ కుటీర పరిశ్రమగా ఉంది. అక్కడ ఒక తుపాకీ ధర రూ.20 వేల లోపే ఉంటుంది. కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ తీసుకొచ్చి రూ. లక్షకు విక్రయిస్తున్నారు. ఎక్కువ లాభం రావడానికి చాలామంది తుపాకుల రవాణాలను చేస్తున్నారు. బీహార్, యూపీ రాష్ట్రాల నుంచి అనేకమంది ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చారు.

దీంతో రాకపోకలు పెరిగాయి. కంపెనీలలో పని చేయడం మానేసి తుపాకుల రవాణా చేస్తున్నారు. జనవరిలో రాచకొండ పోలీసులు తుపాకులు విక్రయించడానికి ప్రయత్నించిన ఒకరిని పట్టుకు న్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన హరే కృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి కొంతకాలం ఉన్నాడు.

ఆ తర్వాత సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. బీహార్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల అక్రమ ఆయుధాలు తయారు చేస్తున్న వారితో పరిచయం ఏర్పడింది. అక్కడ తక్కువ ధరకు రెండు పిస్తాళ్ళు, ఒక తపంచ కొన్ని బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాదులో విక్రయించడానికి పోలీసులు పట్టుకున్నారు. పేరు మోసిన నేరగాడు భక్తుల ప్రభాకర్ నగరంలోని ప్రిజం పబ్ వద్ద పోలీసులు పట్టుకోడానికి ప్రయత్నించగా రెండు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ తర్వాత అతనిని పట్టుకొని విచారించగా, బీహార్ నుంచి తుపాకులు తెచ్చినట్లు తెలిపాడు. 

ప్రజల ఆందోళన 

పట్టణ ప్రాంతాల్లో అక్రమ తుపాకుల వినియోగం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుపాకుల రవాణా మీద పోలీసులు దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. కార్డెన్ సెర్చ్ తరహాలో రౌడీ షీటర్లు, స్మగ్లర్లు, అనుమానిత రియాల్టారు, రాజకీయ నాయకుల ఇల్లు సోదా చేస్తే పెద్ద మొత్తంలో అక్రమ తుపాకులు బయటపడే అవకాశం ఉంది.

అంతేగాక బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే శాంతిభద్రతలు బీహార్ లా మారుతాయని అంటున్నారు. తరచూ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.