25-08-2025 07:34:52 PM
వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఇచ్చే సామాజిక పింఛన్లు ఇక నుండి ముఖ చిత్ర గుర్తింపు ద్వారా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్ లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి ముఖ చిత్ర గుర్తింపుకు 74 సెల్ ఫోన్లను కలెక్టర్ తన చేతుల మీదుగా అందజేశారు. వనపర్తి జిల్లాలో వృద్ధాప్య, ఒంటరి మహిళలకు, చేనేత తదితర సామాజిక పింఛన్లు మొత్తం 71 వేల పై చిలుకు మంది లబ్ధిదారులు పింఛన్లు తీసుకుంటుండగా దాదాపు సగం మందికి ప్రతి నెల నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుండగా మిగిలిన దాదాపు 32 వేల మంది పింఛనుదారులకు165 గ్రామ పంచాయతీల్లో పోస్టాఫీసులలో పింఛను ఇస్తున్నారు. ఈ 165 గ్రామ పంచాయతీల్లో కొంత మంది పింఛనుదారులకు ఆధార్ కార్డు ప్రకారం వెలి ముద్రల గుర్తింపు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుండి సెల్ ఫోన్ లో ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకొని ముఖ చిత్ర గుర్తింపు ద్వారా పింఛన్లు అందజేయనున్నారు. ఇక నుండి వెలి ముద్రల గుర్తింపు ఇబ్బంది లేకుండా ముఖ చిత్రం గుర్తింపు ద్వారా పోస్టాఫీసుల్లో పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికోసం సోమవారం పోస్టాఫీస్ అధికారికి 74 ముఖ చిత్ర గుర్తింపు చేసే సెల్ ఫోన్లను కలెక్టర్ అందజేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం నుండి ప్రభాకర్, పోస్టాఫీస్ సిబ్బంది ఉన్నారు.