calender_icon.png 25 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగలు సాఫ్ట్‌వేర్.. రాత్రి మత్తు దందా!

25-12-2025 02:07:03 AM

  1. ప్రియుడితో కలిసి లేడీ టెక్కీ డ్రగ్స్ వ్యాపారం
  2. జల్సాల కోసం ప్రేమజంట అడ్డదారి
  3. డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు.. క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు
  4. రూ. 3.12 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 24 (విజయక్రాంతి): కార్పొరేట్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగి... అయినా ఆ యువతికి సంతృ ప్తి లేదు. ప్రియుడితో కలిసి విలాసవంతమైన జీవితం గడపాలని ఆశపడింది. ఆ ఆశే ఆమెను నేర ప్రపంచంలోకి నెట్టింది. ప్రియు డు చేసే డ్రగ్స్ దందాకు అన్నీ తానై వ్యవహరిస్తూ, ఆర్థిక లావాదేవీలను చక్కబెడుతున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను, ఆమె ప్రియుడిని, మరో డెలివరీ బాయ్‌ని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, చిక్కడపల్లి పోలీసులు సంయుక్తంగా చిక్కడపల్లిలో బుధవారం నిర్వహించిన ఆపరేషన్ లో అరెస్టు చేశారు.

హెచ్‌న్యూ, చిక్కడపల్లి పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినా డకు చెందిన ఉమ్మిడి ఇమ్మాన్యుయేల్(25), చోడవరుపు సుస్మితాదేవి అలియాస్ లిల్లీ (21) ప్రేమికులు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఇద్దరూ నివసిస్తున్నారు. ఇమ్మాన్యు యేల్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, సుస్మిత ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరికీ వచ్చే జీతాలు వారి విలాసాలకు సరిపోకపోవడంతో ఇమ్మాన్యుయేల్ డ్రగ్స్ పెడ్లింగ్ వైపు మళ్లాడు. అతనికి సుస్మిత కూడా తోడైంది.

నిందితులు పోలీసులకు దొరక్కుండా ఉం డేందుకు అత్యంత సాంకేతిక పద్ధతులను ఎంచుకున్నారు. టోర్ బ్రౌజర్ ఉపయోగించి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసేవారు. ఎవరికీ అనుమానం రాకుండా బైనాన్స్, ట్రస్ట్ వాలెట్ ద్వారా భారతీయ కరెన్సీని యూఎస్డీటీ క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశీ సప్లయర్లకు చెల్లింపులు జరిపేవారు. ఆర్డర్ చేసిన డ్రగ్స్ కొరియర్ సర్వీసుల ద్వారా వీరికి చేరేవి. ఈ కేసులో సుస్మిత పాత్ర చూసి పోలీసులే విస్తుపోయారు. ప్రియుడు ఇమ్మాన్యుయేల్ అందుబాటులో లేనప్పుడు ఆమె దగ్గరుండి వ్యాపారాన్ని నడిపించేది.

డ్రగ్స్ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును నేరుగా తన బ్యాంక్ ఖాతాలో వేసుకుని మేనేజ్ చేసేది. కస్టమర్లతో డీల్స్ మాట్లాడటం, సరకు పంపించడం వంటివి ఆమె పర్యవేక్షించేది. కస్టమర్లకు డ్రగ్స్ చేరవేసేందుకు అదే ప్రాంతానికి చెందిన గొర్ల సాయి కుమార్ (28) అనే యువకుడిని నియమించుకున్నారు. ఇతను స్విగ్గీ, ర్యాపిడోలో పనిచేస్తుం టాడు. ఇమ్మాన్యుయేల్, సుస్మిత చెప్పిన లోకేషన్లకు వెళ్లి, ఎవరికీ అనుమానం రాకుం డా డెడ్ డ్రాప్ కస్టమర్‌ను కలవకుండా ఒక చోట పెట్టడం పద్ధతిలో డ్రగ్స్ డెలివరీ చేసేవాడు.

అయితే విశ్వసనీయ సమాచారంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్-న్యూ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు ఇమ్మాన్యుయేల్, సుస్మి త, డెలివరీ బాయ్ సాయికుమార్‌తో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న తలబత్తుల తారక లక్ష్మీకాంత అయ్యప్ప అనే వినియోగదారుడిని కూడా అరెస్టు చేశారు. రూ. 3.12 లక్షల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త..ఉన్నత చదువులు చదివిన వారు కూడా డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని, పెడ్లర్లుగా మారుతున్నారని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను, స్నేహితు లను గమనిస్తూ ఉండాలని సూచించారు. డ్రగ్స్ సమాచారం ఉంటే 8712661601 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.