23-08-2025 12:05:51 AM
సంగారెడ్డి, ఆగస్టు 22 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్స హించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆదిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం సంగారెడ్డి జిల్లాలోని ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాల సేకరణలో నిమగ్నమైంది. ఈ నెల 19లోగా పూర్తిస్థాయి సమాచారం సేకరించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించినప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో ఆలస్యమైంది. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు.
విద్యుత్ బిల్లుల భారం తగ్గించేలా..
ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో బిల్లులు భారీగా వస్తున్నాయి. సరిపడా నిధు లు లేని కారణంగా పలు శాఖలు కరెంట్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితి. రూ.కోట్ల లో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇది ప్రభుత్వానికి తీవ్ర భారమవుతోంది. దీనిపై దృష్టి సారించిన సర్కారు జిల్లాలోని ఆసుపత్రులు, అంగన్వాడీలు, పాఠశాలలు, పంచా యతీ, ఇతర కార్యాలయాల భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్లను టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.
సమాచార సేకరణలో అధికారులు ..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యం త్రాంగం ప్రభుత్వ కార్యాలయాల భవనాల గుర్తింపునకు కసరత్తు చేపట్టింది. ఇటీవల అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ భవనాల వివరాలు అందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్య దర్శులు వివరాలు సేకరిస్తుండగా , మున్సిపల్ పరిధిలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.
భవనంపై కప్పు విస్తీర్ణం, విద్యుత్ కనెక్షన్ కేటగిరీ, నెల వారీగా వినియోగం వంటి సమాచారం సేకరిస్తున్నారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే చోట ఎల్టీ, ఎక్కువగా ఉన్న భవన సముదాయాలపై హెచ్టీ సర్వీసులతో కూడిన ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.
కలెక్టరేట్, జిల్లా ఆసుపత్రి వంటి విశాల భవనా లపై 100 కిలోవాట్లకు పైబడి సామర్థ్యంతో కూడిన ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం ఆధా రంగా ప్రతిపాదలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా విద్యుత్ ఆదాతో పాటు, పర్యావరణ పరిరక్షణకు ప్రయోజకనకరంగా ఉం టుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వివరాలు సేకరిస్తున్నాం..
ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తదనుగుణంగా వివరాలు పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల వివరాలు సేకరిస్తున్నాం. ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేది లెక్కిస్తున్నాం. ఇప్పటికే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 640 కార్యాలయాల వివరాలు సేకరించాం. సేకరించిన వాటి ప్రతిపాదనలను సిద్ధం చేసి కలెక్టరు నివేదిక అందజేస్తాం.
శ్రీనివాస్, రెడ్కో జిల్లా మేనేజర్, సంగారెడ్డి