10-08-2025 12:42:48 AM
- జీపీ నుంచి సచివాలయం భవనం వరకు..
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): సౌర విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయాలని క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుని సచివాలయం భవనం వరకు అన్నింటిపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై శనివారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, రెడ్కో సీఎండీ అనిలా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు పంపించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీకూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా వాటిని హైదరాబాద్‌కు పంపించవచ్చని సూచించారు.
భారీగా సోలార్ ఉత్పత్తి
గ్రామపంచాయతీ బిల్డింంగ్ మొదలుకుని సెక్రెటేరియల్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసి పెద్దయెత్తున విద్యుత్తు ఉత్పిత్తి చేయనున్నట్టు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కలెక్టర్లు పంపించాల్సిన సమాచారానికి సంబంధించి ఒక ప్ర శ్నావళిని పంపిస్తున్నట్టు, అందులో సమాచారాన్ని నమోదు చేసి వారంలోపు విద్యు త్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి పంపించాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ భవనాలతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల భవనాలపైకూడా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన భవనాల వివరాలను పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల పరిధిలో పెద్దయెత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపించాలని డిప్యూటీ సీఎం సూచించారు.
గిరిజనులకు ఉచిత సోలార్ పంపుసెట్లు
ఏజన్సీ ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఆ భూముల్లో నల్లమల డిక్లరేషన్ కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం కలెక్టర్లకు వివరించారు.
నల్లమల డిక్లరేషన్‌లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరి వికాస పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు ఆలసత్వం చూపించకుండా వారంలోగా వివరాలు పంపించాలని, ఎలాంటి సందేహాలున్నా విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, రెడ్కో వీసీఎండీలను సంప్రదించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.