calender_icon.png 14 September, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమశిల.. అందాల విల్లా !

14-09-2025 12:34:50 AM

పర్యాటకులను ఆకర్షిస్తున్న కృష్ణా తీరం

బొడ్డుపల్లి మల్లయ్య, నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఓ వైపు శైవక్షేత్రాలు.. మరోవైపు ప్రకృతి అందాలు.. ఇంకోవైపు కృష్ణమ్మ పరవళ్లు.. పక్షుల కిలకిలా రావాలు..అలల చప్పుళ్లు ఇలా ఒకటేమిటి ఆ కృష్ణా నదీ తీరంలో మానసిక ప్రశాంతత కోరుకునే వారికి సోమశిల ఓ అందాల విల్లా. ఆకాశం భూమి మధ్యలో నీరు.. ఆపై చల్లటి గాలి..

అప్పుడప్పుడు పలకరించే కృష్ణమ్మ అలలను ఆస్వాదిస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి 120 కిలోమీటర్ల లాంచి ప్ర యాణం పర్యాటకులను మైమరిపిస్తోంది. పర్యాటకులు వారాంతంలో అక్కడే ఉండి ఆహ్లాదాన్ని ఆస్వాదించేలా తెలంగాణ ప్రభుత్వం రిసార్ట్‌లను, పర్యాటకప్రదేశాలను అభివృద్ధి చేస్తోంది.

సప్త నదుల సంగమంతో సంగమేశ్వర ఆలయంగా.. 

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం నుంచి సోమశిల, మంచాలకట్ట అమరగిరి వంటి ప్రాంతాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమశిల ప్రాంతంలోని శివాలయం, సప్త నదుల సంగమం, సంగమేశ్వర ఆలయం ఎంతో చరిత్ర గలవి. క్రీస్తుశకం 10వ శతాబ్దంలోని రాక్షసుల యుగంలో సంగమేశ్వర ఆలయ స్థలం వద్ద ఓ మహర్షితపస్సు చేసి శివుని ఆశీస్సు పొందారు. ఏడు నదులు ఒకే చోట కలిసి పోయే ప్రాంతంగా సప్త నదుల సంగమం సంగమేశ్వర ఆలయంగా పేరొందింది.

ప్రాచీన శిల్ప కలలతో కూడిన శిల్పాలు అక్కడ కొలువై ఉన్నాయి. శ్రీశైలం తిరుగు జలాలు తాకి కృష్ణమ్మ ఒడిలోనే కొలువై ఉంటుంది. సుమారు ఏడాదిలో ఆరు మాసాలు మాత్రమే భక్తులకు ఆ సంగమేశ్వర ఆలయం దర్శనమిస్తుంది. సోమశిల శివాలయాన్ని మాత్రం ఆధ్యాత్మికత పెంపొందించి భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో భారత పురావాస్తు శాఖ నది ఒడ్డున ఈ ఆలయాలను పునర్నిర్మించారు. 

అభివృద్ధికి భారీగా నిధులు

ఎంతో పవిత్ర గల శివలింగాలు ప్రసిద్ధి చెంది ఉండడంతో భక్తులు, పర్యాటకులు, శైవపరులు ప్రతీ సంవత్సరం శివరాత్రి, కార్తీక మాస పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు.క్రమంగా పర్యాటకులు భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందాలని భారీగా నిధులు కేటాయిస్తోంది.

హెలికాప్టర్ సేవలకు ప్రతిపాదనలు

తెలంగాణలో హెలీ టూరిజం ప్రారంభానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు నెలల క్రితం సోమశిల వద్ద హెలీ టూరిజం ప్రాజెక్టు, వెల్‌నెస్ సెంటర్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈజ్ మై ట్రిప్ సహకారంతో హైదరాబాద్ సోమశిల శ్రీశైలం మధ్య హెలికాప్టర్ సేవలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్  కోసం రూ.45.84 కోట్లు, సోమశిల వీఐపీ ఘాట్, బోటింగ్ పాయింట్ రూ.1.60 కోట్లు, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.68.10 కోట్లు నిధులతో శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.