19-07-2025 10:29:00 PM
- ప్రాణాపాయ స్థితిలో ప్రేమ్ కుమార్
- గజ్వేల్ పోలీస్ స్టేషన్ ముందు ఘటన
గజ్వేల్: క్యాన్సర్ తో బాధపడుతున్న తల్లికి వైద్యం చేయించలేకపోతున్నాను అన్న బాధతో ఓ కొడుకు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గజ్వేల్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ పట్టణానికి చెందిన చిక్కుడు ప్రేమ్ కుమార్ తన తల్లికి క్యాన్సర్ వ్యాధి రావడంతో గత ఏడాది క్రితం హైదరాబాదులోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి(MNJ Cancer Hospital)కి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. పలు కారణాలు చెబుతూ వైద్యులు 8 నెలలు ఆలస్యం చేసి ప్రేమ్ కుమార్ తల్లికి క్యాన్సర్ గడ్డ ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులకు ప్రేమ్ కుమార్ తల్లి మళ్ళీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాడు.
వైద్యులు పరిశీలించి శరీరమంతా ఇన్ఫెక్షన్ అయిందని కీమోథెరపీ ఇతర వైద్యాలు చేయాలని చెప్పారు. రచన దోస ఒకటే మాట వైద్యులు ఆలస్యంగా వైద్యం చేయడం వల్లే తన తల్లి ఇన్ఫెక్షన్కు గురైందని ప్రేమ్ కుమార్ ఆరోపిస్తున్నారు. క్యాన్సర్ ఆపరేషన్ చేసినప్పుడే ఆసుపత్రి చుట్టూ తిరగడానికి డబ్బులు అన్ని ఖర్చయ్యాయని, ఇప్పుడు తల్లికి మళ్లీ వైద్యం చేయించడానికి డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన తల్లికి వైద్యం చేయించలేకపోతున్న అనే ఆవేదనతో గజ్వేల్ పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి ప్రేమ్ కుమార్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అతని స్నేహితులు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర వైద్యశాఖ మంత్రులే నా ఆత్మహత్యకు కారణం
ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో అధికారులు సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వీరి నిర్లక్ష్యంపై పర్యవేక్షణ చేయని హైదరాబాద్ డిఎంహెచ్వో, కేంద్ర రాష్ట్ర వైద్యశాఖ మంత్రులే తన ఆత్మహత్యా యత్నానికి కారణం అంటూ ప్రేమ్ కుమార్ ఒక లేఖలో పేర్కొన్నాడు. మీ అందరిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో రాశాడు. ఎం ఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఒక్కో సేవకు ఒక్కో రేటును సిబ్బంది నిర్ణయించారని, సూది ఇవ్వడానికి రూ.50, బెడ్ షీట్ మార్చడానికి రూ. 20, రోగితో బంధువులు ఉండడానికి మరో రేటు ఇలా ఒక్కో సేవకు ఒక్కో రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రేమ్ కుమార్ తెలిపినట్లు అతని మిత్రులు వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని. తాను చనిపోతే తన కిడ్నీలు అమ్మి తన తల్లికి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాలని లేఖలో ప్రేమ్ కుమార్ పేర్కొన్నాడు.