calender_icon.png 10 January, 2026 | 9:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

09-01-2026 09:26:08 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా మెట్ పల్లి  పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పరిష్కరించాలని, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ తనఖీ చేశారు.

విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ, వారు ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆక్సిడెంట్ జోన్ లుగా,  బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.

సంక్రాంతి పండుగ సమయంలో చాలా మంది తమ స్వగ్రామాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లడం వల్ల ఇండ్లు ఖాళీగా ఉండే అవకాశముందని, ఈ పరిస్థితిని దొంగలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశముంటుందని కావున  ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా ను విక్రయించినా, వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, చైనా మాంజా విక్రయాలు, రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చైనా మాంజా వల్ల మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. నైలాన్,సింథటిక్ దారాలు పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు తీవ్రమైన హానిని కలిగిస్తాయని, గతంలో అనేక ప్రమాదాలు, ప్రాణనష్టాలు సంభవించిన దృష్ట్యా జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు  చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా సంబంధిత సమాచారం ఉంటే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ వంద కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.