calender_icon.png 23 October, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో స్పేస్ టెక్ క్లస్టర్

23-10-2025 12:26:49 AM

  1. స్టార్టప్‌లతో తెలంగాణ మోడల్ ఆవిష్కృతమైంది 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. రాయదుర్గంలో బయో ఇన్‌స్పైర్డ్ ఫ్రాంటియర్స్ సదస్సు

హైదరాబాద్ సిటీ బ్యూ, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : హైదరాబాద్‌ను సైన్స్, టెక్నాలజీ, అంతరిక్ష రంగాలకు గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఫార్మా, ఐటీ, రక్షణ రంగాల తరహాలోనే నగరంలో స్పేస్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి, ఈ పరిశ్రమను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జియో ప్యాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బయో ఇన్‌స్పుర్డై ఫ్రాంటియర్స్-2025 అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దార్శనికతతో హైదరాబాద్‌లో శాస్త్ర, సాంకేతిక పరిశోధన సంస్థలకు బీజం పడిందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఆయన వేసిన పునాదుల వల్లే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్‌ను దేశానికి ఆకాశనేత్రంగా మార్చింది. డీఆర్‌డీవోకు చెందిన వంటి ప్రయోగశాలలు, బీడీఎల్, మిధాని, ఈసీఐఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడే పురుడుపోసుకుని దేశ రక్షణ, సాంకేతిక రంగాలకు వెన్నెముకగా నిలిచాయి.

ఈ దశాబ్దాల పెట్టుబడే హైదరాబాద్‌కు ఒక ప్రత్యేకమైన సైన్స్ డీఎన్‌ఏను ఇచ్చింది అని ఆయన అన్నారు.ఈ చారిత్రక వారసత్వాన్ని నేటి యువ ఆవిష్కర్తలు కొత్త ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నారని భట్టి కొనియాడారు. స్కురైట్ ఏరోస్పేస్ ఇక్కడే పుట్టి, ప్రైవేట్ రంగంలో రాకెట్ ప్రయోగాలను సాధ్యం చేసి చూపింది. ధ్రువ స్పేస్ వంటి సంస్థలు ప్రపంచ స్థాయి ఉపగ్రహ వ్యవస్థలను మన రాష్ర్టంలోనే రూపొందించ గలమని నిరూపిస్తున్నాయి.

ఇదే తెలంగాణ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభుత్వ సంస్థలు పునాదులు వేస్తే, స్టార్టప్‌లు వాటిపై నిర్మిస్తాయి, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, హెసీయూ, టీ-వర్క్స్ వంటి విశ్వవిద్యాలయాలు ప్రతిభను పెంపొందిస్తాయి, అని ఆయన వివరించారు. ప్రకృతే అసలు ఇంజనీర్. మన కర్తవ్యం ప్రకృతిని మించిపోవడం కాదు, దాని నుంచి నేర్చుకోవడం. ఈ తత్త్వాన్ని మా ప్రభుత్వం అభివృద్ధి దృక్పథంలో భాగం చేస్తోంది, అని భట్టి పేర్కొన్నారు.

ఇప్పటికే అదిభట్లలో ఏరోస్పేస్, ఈ-సిటీలో ఎలక్ట్రానిక్స్, జీనోమ్ వ్యాలీలో ఫార్మా, షంషాబాద్ వద్ద మొబిలిటీ వ్యాలీ వంటి విజయవంతమైన క్లస్టర్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో అంతరిక్ష రంగంలోనూ ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి పరిశ్రమకు చేయూతనిస్తామన్నారు.భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తెలంగాణ లాంప్యాడ్‌గా ఉండాలని సంకల్పించాం.

ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సహాయక విధానాలు అందించ డానికి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచంలోని పరిశోధకులు, పెట్టుబడిదారులకు మా స్వాగతం. భూమికి, ఆకాశానికి మధ్య హైదరాబాద్ ఒక సేతువుగా నిలుస్తుంది అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జియో ప్యాక్ సీఈవో ఎం. అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.