23-10-2025 12:26:45 AM
-నిందితుల వద్ద 3 లక్షల 60 వేల రూపాయల విలువైన బంగారం స్వాధీనం
-నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ నరసింహ
హుజూర్ నగర్, అక్టోబర్ 22 : నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో ఈనెల 14న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు.బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు. హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వెనుక వీధిలో చిన్న అనసూయమ్మ (60), భర్త నాగేశ్వరరావు, అనుమానాస్పదంగా మృతి చెందింది.
దీంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పంచనామా చేసే సమయంలో వృద్ధురాలి శరీరంపై రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు ఫిర్యాదుతో సిఐ చరమందరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించి, పట్టణంలోని సీసీ కెమెరాలు,ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోపు తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి
పట్టణంలోని తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నటువంటి లింగం సతీష్ వృద్ధురాలు వద్ద 50 వేల రూపాయల అప్పుగా తీసుకొని వడ్డీని చెల్లిస్తున్నాడు.దీంతో వృద్ధురాలు వద్దకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు.వృద్ధురాలు కుమారుడు వంట పని నిమిత్తం వారణాసి వెళ్లడంతో అనసూర్యమ్మ ఒంటరిగా ఉండడం గమనించారు. ఇదే అదునుగా గమనించి లింగం సతీష్,అతని మేనల్లుడు మైనర్ (16) ఇరువురు ఈనెల 14న రాత్రి అనసూయమ్మ ఇంటికి వెళ్లి మద్యం తాగించిన తర్వాత మత్తులో ఉన్న ఆమెను అదేరోజు రాత్రి లింగం సతీష్ ఆమె నోరును ముక్కును చేతులతో మూసివేసి లింగం సతీష్ మేనల్లుడు వృద్ధురాలి రెండు కాళ్ళను గట్టిగా పట్టుకోవడంతో ఊపిరి అందక ఆమె మృతి చెందింది.
దీంతో వృద్ధురాలి వద్దనున్న బంగారపు ఉంగరం, నాన్ తాడు, చెవులకు ఉన్న మాటీలు దిద్దులు, లింగం సతీష్, వృద్ధురాలు వద్ద అప్పుగా తీసుకొని రాసిచ్చిన ప్రామిసరీ నోటును బీరువా నుండి దొంగలించి వీటన్నింటినీ తీసుకొని లింగం సతీష్ భార్య మౌనికకు తెలపడంతో ఆమె సలహాలతో దొంగలించిన బంగారాన్ని విజయవాడలో గోల్డ్ షాపులకు తీసుకువెళ్లి వస్తువులను కరిగించి బంగారాన్ని తమ వద్ద దాచుకున్నారు.నిందితుల వద్ద చిన్న బంగా రు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.ఈ కేసు దర్యాప్తులో చకాచక్యంగా వ్యవహరించిన సీఐ చరమంద రాజును కానిస్టేబుల్ నాగరాజు, గోలి శంభయ్యలకు రివార్డును అందించి ప్రత్యేకంగా అభినందించారు.