19-08-2025 01:09:37 AM
- ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి రోడ్లు
- ఆదిభట్ల మున్సిపాలిటీలో ఆగని అక్రమాలు
- అధికారుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
- మున్సిపాలిటీలో పార్కు స్థలాలకు రక్షణ కరువు
- కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కమిషనర్
- అభివృద్ధి ముసుగులో అక్రమాలను
- ప్రోత్సహిస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం
మున్సిపాలిటీలో ఏ నిర్మాణం జరగాలన్న మున్సిపల్ అధికారుల ప్రమేయం లేనిదేది ఉండదు. కానీ మున్సిపాలిటీలో అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, మున్సిపల్ నిబంధనలు తుంగలో తొక్కుతూ.. కనుసైగలతో అక్రమాలకు ఆజ్యం పోస్తూ అభివృద్ధి ముసుగులో అక్ర మ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు రంగారెడ్డి కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న ఆదిభట్ల మున్సిపాలిటీలోనే.. అన్యాక్రాంతమవుతున్న పా ర్కు స్థలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 : మున్సిపాలిటీ పరిధిలో పార్కు స్థలాలకు రక్షణ కరు వైంది. అధికారుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతూ.. పార్కు స్థలాలు, ప్రభుత్వ భూ ములు ఎక్కడ కనిపించిన యదేచ్చగా, నిర్మొహమాటంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వివరాలకు వెళితే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో కొంగరకలాన్ సమీపంలోని శ్లోక కన్వెన్షన్ హాల్, గతంలో ఇది నిర్మించే క్రమంలో హెచ్‌ఎండీఏ ప్లాన్ లో భాగంగా రోడ్లు, పార్కింగ్ ఏరియాలను ఆదిభట్ల మున్సిపాలిటీకి 1348.34 గజాల స్థలా న్ని గిఫ్ట్ డీడ్ చేశారు.
కన్వెన్షన్ హాల్ నిర్మాణం పూర్తయ్యాకా, ఈ స్థలాన్ని ఆక్రమించి, 500 మీటర్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తు లో రోడ్డు నిర్మించారు. అనంతరం ఈ స్థలాన్ని కన్వెన్షన్ హాల్ యజమాని తన భా ర్య పేరిట లీజ్ డీడ్ సైతం చేయడం జరిగింది. అయితే దీనిపై స్థానికుల నుండి ఫి ర్యాదులు వచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకో లేదు. కోట్లు విలువచేసే పార్క్ స్థలాలు అన్యాక్రాంతమవుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి అన్యాక్రాంతమవుతున్న పార్కు స్థలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
మున్సిపాలిటీ స్థలం లీజ్ డీడ్
శ్లోక యాజమాన్యం ముందుగా 5 ఎకరాల భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని, తర్వాత ఆ భూమిలో కన్వెన్షన్ హాల్ నిర్మిం చే క్రమంలో హెచ్‌ఎండీఏ అనుమతులకు వెళ్లగా, ఈ ప్లాన్ లో భాగంగా 1348.34 గజాల స్థలం ఆదిభట్ల మున్సిపాలిటీకి గిఫ్ట్ డిడ్ చేశారు. ఆ తర్వాత వారికి మిగిలింది 22851.66 గజాల స్థలం మాత్రమే. కానీ, ఈ గిఫ్ట్ డీడ్ స్థలాన్ని కలుపుకొని మొత్తం 24200 గజాల స్థలాన్ని శ్లోక యజమాని తన భార్య పేరిట లీజ్ డీడ్ చేశారు.
మున్సిపల్ కమిషనర్ విఫలం
ఆదిభట్ల మున్సిపాలిటీకి సంబంధించిన గిఫ్ట్ డీడ్ స్థలాన్ని కాపాడాలని హెచ్‌ఎండీఏ నుండి 2025 మే 12వ తేదీన మున్సిపల్ కమిషనర్ కు 15 రోజుల గడువులోగా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. అనంతరం ఇదే అంశంపై జూలై 22న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుండి ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ కు హెచ్‌ఎండీఏ పంపిన లేఖ ఆధారంగా గిఫ్టు డిడ్ స్థలంపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. కానీ నేటికీ కూడా శ్లోక కన్వెన్షన్ యాజమాన్యం ఆక్రమించిన గిఫ్ట్ డీడ్ స్థలాన్ని కాపాడడంలో మున్సిపల్ కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారు.
అంత:పురం కాలనీలో పార్కుకబ్జా
ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని అంత:పురం కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో 2260 గజాల ఖాళీ స్థలం కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసి, ప్రహరీ గోడ నిర్మించారు. కావున ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని కాపాడాలని ఇటీవలా కాలనీవాసులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
కనుసైగల్లో అక్రమాలకు ఆజ్యం
మున్సిపాలిటీలో పార్క్ స్థలాలు అన్యాక్రాంతం అవ్వడమే కాకుండా, మున్సిపల్ నిబంధనలు అతిక్రమించి ఆదిభట్ల టీసీఎస్ ఎదురుగా మంగళపల్లి ‘ఎక్స్’ రోడ్ సమీపంలో జీ+3,4 అంతస్తుల అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో అన్యాక్రాంతమవుతున్న పార్కు స్థలాల విషయంపై వివరణ కోసం మున్సిపల్ కమిషనర్ ను సంప్రదించినప్పటికీ అందుబాటులోకి రాలేదు.