03-07-2025 08:56:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): బాలశక్తి కార్యక్రమం కింద గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్(District Lead Bank Manager Ram Gopal) ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డిఎం మాట్లాడుతూ... విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఆర్థిక వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, పొదుపు అలవాట్లు వంటి అంశాలు ఆర్థిక అక్షరాస్యతలో భాగమని వివరించారు.
బ్యాంకుల్లో వాడే వివిధ ఫారముల వాడుక, రుణాల ప్రక్రియ, సివిల్ స్కోర్ ప్రాముఖ్యత, విద్య, వాహనం, గృహ రుణాల అవసరాల గురించి విద్యార్థులకు వివరించారు. చిన్న వయస్సులో నుంచే చిన్నచిన్న పొదుపులను అలవాటు చేసుకొని భవిష్యత్తును ఆర్థికంగా నిర్మించుకోవాలని అన్నారు. సాంకేతిక యుగంలో ఆర్థిక నేరాల పెరుగుదల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, మిషన్ సాథి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సబిత, మౌనిక, ఉపాధ్యాయులు రామేశ్ గౌడ్, రాజేశ్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.