03-07-2025 08:47:32 PM
తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం...
సూర్యాపేట (విజయక్రాంతి): కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం(Leader Tammineni Veerabhadram) అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సంఘాల జిల్లా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. 2025-26 బడ్జెట్ లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాన్యులపై బారాలు మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడుదారులకు ఐదు వేల కోట్లు రాయితీ ప్రకటించిందన్నారు.
ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఢిల్లీలో రైతులు పోరాటం చేసిన సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు కో లిశెట్టి యాదగిరిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.