calender_icon.png 5 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

04-10-2025 07:00:58 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మారుమూల ఆదివాసి, గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ఎడిఎంహెచ్వో డాక్టర్ సైదులు అన్నారు.శనివారం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు మొరంపల్లి బంజర పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్యం తీరును,రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం నడుస్తున్నందున పీహెచ్సీ పరిధిలోని గిరిజన గ్రామాలలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇతర వైరల్ ఫీవర్స్ విజృంభించే అవకాశం ఉన్నందున పీహెచ్సీలలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

ఐదు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు తప్పనిసరిగా టిప్పా స్కానింగ్ చేయించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీలలో గర్భిణీ స్త్రీల నమోదు పెంచాలని, ప్రసూతి కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలని, పీహెచ్సీకి వచ్చే రోగుల పట్ల మర్యాద పాటించి వారికి సరైన వైద్య చికిత్సలు అందించి తగినన్ని మందులు అందించాలని అన్నారు. పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని, ఇంటి ముందు ఇంటి వెనక నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు వహించేలా ప్రజలకు తెలియజేయాలని, డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ ఉండుట వలన దోమలు ప్రబలి మలేరియా, టైఫాయిడ్, డెంగు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పీహెచ్ సి లలో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకొని, మలేరియా డెంగ్యూ మరణాలు సంభవించకుండా చూడాలని అన్నారు.