17 April, 2026 | 4:47 AM

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి

30-12-2025 01:33 AM

పారిశుధ్య వాహనాలను ప్రారంభించిన కలెక్టర్, టీజీఐఐసీ చైర్మన్

సంగారెడ్డి, డిసెంబర్ 29 :సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.40 లక్షల వ్యయంతో నాలుగు పారిశుద్ధ్య వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అలాగే 400 పైచిలుకు మునిసిపల్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుధ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి పని మరింత సులభంగా, వేగంగా సాగేందుకు ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

ఈ వాహనాల ద్వారా చెత్త సేకరణ, తరలింపు పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయన్నారు. పారిశుధ్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.

పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదవశాత్తు తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం కలిగిన లేదా మరణించిన సందర్భాల్లో ఈ ప్రమాద బీమా పాలసీ ద్వారా బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.