పట్టపగలే మట్టి అక్రమ రవాణా జేసీబీ, మూడు టిప్పర్ల స్వాధీనం
మనోహరాబాద్, డిసెంబర్ 29 :మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పరిధి టీజీ ఇండస్ట్రీస్ ప్రాంతంలో పరిశ్రమల నిర్మాణం కొరకు ప్రభుత్వం భూమిని కేటాయించడం జరిగింది. ఇందులో భాగం గా ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మాణ దశలో ఉండ గా పట్టపగలే అక్రమంగా మట్టిని ప్రభుత్వ భూములలో నుండి తవ్వి ఇండస్ట్రీస్ నిర్మాణ దశలో ఉన్న వాటికి తరలిస్తున్నారు.
ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కొందరు వ్యక్తులు జెసిబి టిప్పర్లను ఉపయోగించి కొండాపూర్ లోని ఒక ప్రభుత్వ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మట్టిని అక్రమంగా దండుకుంటున్నారు. ఇలా గత కొంతకాలంగా అక్రమ మట్టి వ్యాపారం యథేచ్చగా కొనసాగడంతో కొందరు గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకపోగా ఇదేమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మనోహరాబాద్ పోలీసులు అక్రమంగా తవ్వుతున్న జెసిబిని, మూడు టిప్పర్లను స్వాధీన పరచుకొని సీజ్ చేయడం జరిగింది. ఇకమీదట ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని మనోహరాబాద్ తహసిల్దార్, ఎస్‌ఐ సుభాష్ గౌడ్ లు తెలిపారు.






