12-08-2025 01:08:02 AM
నాగార్జునసాగర్, ఆగస్టు 11: నల్గొండ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వపరంగా అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ ఇంకా కొన్నిచోట్ల కొన్ని సేవలలో ఇబ్బందులు ఉండవచ్చని, అలాంటివాటిని గుర్తించి గిరిజన ఆరో గ్యంపై ప్రత్యేక దృష్టి సారించే విధంగా ముందుకు రావాలని నైస్ సంస్థ ప్రతినిధులతో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.
మారుమూల గిరిజన ప్రాంతాలు, చెంచుగూడెంలు, పెంటల్లో నివ సించే గిరిజనులకు సరైన వైద్య సేవలు అందక ఇబ్బంది పడకుండా వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా కృషి చేస్తున్న ‘నైస్ ‘స్వచ్ఛంద సంస్థ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో గిరిజనులకు వైద్య పరమైన సేవలలో సహకరించేందుకు ముందుకు వచ్చింది.
ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ లోని నందికొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ‘నైస్‘ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాఖీ మాట్లాడుతూ ఇప్పటివరకు వారు పనిచేసిన నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్, రాంపూర్ చెంచుపేట లతోపాటు, 5 రాష్ట్రాలలో గిరిజనుల ఆరోగ్యానికై పనిచేసిన అనుభవాలను వివరించారు.
చెంచులు గిరిజనులకు అవసరమైన వైద్య సహాయాలను గుర్తించి వారికి అందించడంలో తమ సంస్థ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగార్జునసాగర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆస్పత్రి వివరాలను, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు తదితర వివరాలను డి సి హెచ్ డాక్టర్ మాతృ నాయక్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
వీరితో పాటు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పెద్దవూర స్పెషల్ ఆఫీసర్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ డాక్టర్ రవి ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, రిచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రష్మీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, నందికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.