14-11-2025 12:26:26 AM
పకడ్బందీగా నాకాబంది ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి/ జహీరాబాద్, నవంబర్ 13 :తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో గట్టి నాకాబంది నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం రాత్రి జాతీయ రహదారి 65 చిరాగ్ పల్లి వద్ద గట్టి బందోబస్తు మధ్య నాకాబంది నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను, తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రతి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నిషేధించిన గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, ఇతర మాదకద్రవ్యాలు, పీడిఎస్ రైస్ అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అంతర్ రాష్ట్ర నేరస్తులు పేలుడు స్వభావం గల మందుగుండు స్వభావం గల సామాగ్రిని జిల్లాలోకి అక్రమంగా రవాణా కాకుండా నిఘా పెంచామన్నారు.
వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసి వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 80 మంది సిబ్బందితో వివిధ బృందాలుగా విభజించి నాకాబంది నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు 850 వాహనాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నాకాబందిలో జిల్లా అదనపు ఎస్పీ రఘునందన్ రావు, జహీరాబాద్ డీఎస్పి సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం, బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సదాశివపేట ఇన్స్పెక్టర్ వెంకటేష్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సాయుధ విభాగం సిబ్బంది, డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.