23-08-2025 12:04:49 AM
రాష్ట్రంలో బెస్ట్ స్పోర్ట్స్ స్కూల్ గా తయారు చెయాలి
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఈ నెల 31వ తేదీ నాటికి హనుమకొండ జేఎన్ఎస్ లో తాత్కాలికంగా నిర్వహించనున్న స్పోర్ట్స్ స్కూల్ లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కుడా కార్యాలయంలో హనుమకొండ జేఎన్ఎస్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో సౌకర్యాల కల్పన పై కుడా ఛైర్మన్ వెంకట్రాం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు, కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇతర ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంచి వసతులు కలిగిన పాఠశాలగా ఉండాలని, వరంగల్ స్పోర్ట్స్ స్కూల్ బాగుందని విద్యార్థులు చాటిచెప్పే విధంగా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 31లోగా స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు సంబంధించిన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పనకు సంబందించిన అన్ని పనులు పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ స్కూల్ లో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఆలస్యం చేయొద్దు అని అన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభించుకునే విధంగా ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.
జేఎన్ఎస్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ స్కూల్ లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, స్పోర్ట్స్ విద్యార్థులకు వసతి, భవనాలకు రంగులు వేయడం, లైట్లు, తదితర ఏర్పాట్లను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో శాశ్వత స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి అన్నీ అనుకూలంగా ఉన్న భూములను త్వరగా గుర్తించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ కు సూచించారు. హైదరాబాద్, ఇతర నగరాల్లోని స్పోర్ట్స్ స్కూల్స్ లో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించాలన్నారు.
వరంగల్ లో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు, సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను చూపిస్తున్నారని పేర్కొన్నారు. మడిపల్లి, ధర్మసాగర్ ఏరియాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. అలాగే క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సంబందించి స్థలాన్ని వెంటనే గుర్తించాలని తెలిపారు. ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల వద్ద ఉన్న 22ఎకరాలు క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు అనువైన స్థలం అని వెల్లడించారు. ఆ స్థల సేకరణకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించెందుకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత తొందరగా స్థల సేకరణ పూర్తి చేయాలనీ అన్నారు.