19-09-2025 12:52:34 AM
కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో నిర్మిస్తున్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, జూనియర్ కాలేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవన నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయని ఇంకా ఎన్ని రోజులలో పూర్తవుతుందని ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాధాన్యత క్రమంలో అత్యవసరమైన నిర్మాణాలను ముందుగా పూర్తి చేయాలని సూచించారు. డార్మెంటరీ తరగతి గదులు కిచెన్ టాయిలెట్స్ వంటి వాటిని ముందుగా పూర్తి చేసుకుని వినియోగించుకోవాలని ఆదేశించారు. బోడుప్పల్ లో ప్రైవేటు బిల్డింగ్ లో నిర్వహిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ను దసరా సెలవుల లోపు తరలించాలని ఆర్సిఓను ఆదేశించారు.
నిర్మాణ పనులను చేపట్టాలని అత్యవసరమైన వాటిని ముందుగా పూర్తి చేసుకుని భవనాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మొత్తము ఎంత మంది విద్యార్థులు ఉన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదనంగా అవసరమైన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మార్వో భూపాల్ ఆర్ సి ఓ నాగార్జున ప్రిన్సిపల్ మమత తదితరులు పాల్గొన్నారు.