14-10-2025 01:38:14 AM
నగర రహదారులపై బాధ్యతాయుత సంస్కృతిని పెంచడమే లక్ష్యం
వినూత్న సోషల్ మీడియా చాలెంజ్‌కు హైదరాబాద్ పీపీ సజ్జనార్ శ్రీకారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి ):నగరంలో రహదారి భద్రతను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా యువతలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్టాలిన్ సినిమా తరహాలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా శక్తిని వినియోగించుకుంటూ, ఆయన సోమవారం ‘సేఫ్ రైడ్ ఛాలెంజ్’ అనే డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించారు.
వాహనదారులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు హెల్మెట్ ధరించడం లేదా సీటు బెల్ట్ పెట్టుకోవడం వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నట్లుగా ఒక చిన్న ఫొటో లేదా వీడియో తీయాలి. ఆ పోస్టును తమ సోషల్ మీడియా ఖాతాలలో నసేఫ్‌రైడ్‌ఛాలెంజ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోవాలి. అనంతరం, తమ స్నేహితులు లేదా కుటుంబసభ్యులలో ముగ్గురిని ట్యాగ్ చేసి, ఈ సవాల్‌ను స్వీకరించమని కోరాలి.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, భద్రత అనేది ఎప్పటికీ పాతబడని ఫ్యాషన్. ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని రక్షించుకునే ఒక నిర్ణయంతోనే మొదలవుతుంది. మనమందరం కలిసి, 2025లో భద్రతనే ఒక చక్కని ట్రెండ్‌గా మారుద్దాం, అని నగర పౌరులకు పిలుపునిచ్చారు.
ఈ గొలుసుకట్టు ఛాలెంజ్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి స్ఫూర్తినిస్తూ, ట్రాఫిక్ నియమాలపై గౌరవాన్ని, సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులపై అలవాటును పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ డిజిటల్ ఛాలెంజ్‌లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయడం ద్వారా, హైదరాబాద్ నగర రహదారులపై భద్రత, బాధ్యతతో కూడిన సంస్కృతిని నిర్మించాలని పోలీస్ శాఖ ఆశిస్తోంది.