14-10-2025 01:41:32 AM
దసరాకు ఇంటికెళ్లిన బాలుడితో వెలుగు చూసిన ఘోరం
నిందితుడిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 13 (విజయక్రాంతి ):రక్షణ కల్పించాల్సిన వాడే రాక్షసుడిగా మారాడు. అభంశుభం తెలియని చిన్నారులకు అండగా నిలవాల్సిన సంరక్షకుడే కామాంధుడిగా మారి వారి జీవితాలతో చెలగాటమాడాడు. హైదరాబాద్ సైదాబాద్‌లోని ప్రభుత్వ వీధి బాలుర గృహంలో పర్యవేక్షకుడు రెహమాన్ ఆరుగురు బాలురపై అసహజరీతిలో లైంగిక దాడికి పాల్పడిన అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ జైల్ గార్డెన్ ప్రాంతంలోని ప్రభుత్వ వీధి బాలుర గృహంలో ఈ పైశాచికత్వం చోటుచేసుకుంది. దసరా పండగకు ఇంటికి వచ్చిన ఓ బాలుడు, తిరిగి జువెనైల్ హోమ్‌కు వెళ్లనని తల్లి వద్ద భోరున విలపించాడు. అనుమానంతో తల్లి ఆరా తీయగా, పర్యవేక్షకుడు రెహమాన్ తనపై అసహజరీతిలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న భయంకర నిజాన్ని బయటపెట్టాడు. దీంతో నిర్ఘాంతపోయిన ఆ తల్లి వెంటనే సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట బాధితుడు ఒక్కడేనని భావించినా, లోతుగా విచారించగా మరో ఐదుగురు చిన్నారులపై కూడా రెహమాన్ ఇదే తరహా పైశాచికత్వానికి పాల్పడినట్లు తేలింది. బాధిత బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఐదుగురు బాలురకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిందితుడు రెహమాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.