28-07-2025 01:56:27 AM
విద్యుత్ తీగ తెగిపడిందనే పుకార్లే కారణం
డెహ్రాడూన్, జూలై 27: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న మానసాదేవి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురు భక్తులకు గాయాలయ్యాయి. కరెంట్ షాక్ పుకారుతోనే ఈ ఘోర విషాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తు జరిపిన అధికారులు గుర్తించారు. జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ.. ‘విద్యుత్ తీగ తెగిపోయిందనే పుకారును ఎవరో వ్యాప్తి చేశారు.
ఘటన జరిగిన సమయంలో ని ఫొటోలు, వీడియోలు చూస్తే విషయం స్పష్టం అవుతోంది. మృతులెవరూ విద్యుత్ షాక్‌కు గురైన ఆధారాలు లభించలేదు. ఈ పుకారును ఎవరు వ్యాప్తి చేశారనే దానిపై దర్యాప్తు చేస్తాం. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం’ అని పేర్కొన్నారు.
సీఎం సంతాపం
మానసాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన బాధాకరమని, పోలీసులు, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు.