07-08-2025 01:23:02 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): సీఎంగా రేవంత్‌రెడ్డి ఇంకా మూడున్నరేళ్లే ఉంటారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజగో పాల్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి విమర్శలు చేశారు.
సీఎం గా ఉన్న రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా తన భాష ను మార్చుకోవాలని, ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నా మో చెప్పాలని హితవు పలికారు. ఇప్పటికే ప్రాజెక్టుల పేరుతో 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితో తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ ప్రామిస్ చేసిందని ఆయన గుర్తు చేశారు.
అయితే సీఎంగా రేవంత్‌రెడ్డి ఇంకా మూడున్నరేళ్లే ఉంటారని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్కరి వల్ల కాద న్నారు. సోషల్ మీడియా విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరు ‘ ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడ మల్లన్న అన్నట్లుగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘ నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పింది ఏఐసీసీ అని.. ఇందులో నా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏం సంబంధం లేదు. రాష్ర్టంలో పత్రిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ రావడం లేదు. ఇకనైనా ఆయన తన పదవికి రాజీనామా చేసి వేరే వ్యక్తికి ఇస్తే బెటర్ ’ అని అన్నారు.
అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో బీఆర్‌ఎస్ వాళ్లు ఉన్నారని.. అందుకే కాళేశ్వరం విషయంలో తమ ప్రభత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఒకవేళ బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళితే.. కేసీఆర్ ఏనాడో తనకు మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేతో కోమటిరెడ్డి భేటీ..
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల గురించి ఇరువురు చర్చించినట్టు సమాచారం. అయి తే తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చిందని శివకుమార్‌కు తెలిపిన కోమటిరెడ్డి... ఆ విషయాన్ని హైకమాండ్ కు గుర్తు చేసే బాధ్యత డీకేకు అప్పగించినట్లు సమాచారం.
కాగా తనకు మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్న రాజగోపాల్.. తరచూ సీఎం రేవంత్ రెడ్డిపై మాటలతో విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. తన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి కూడా పదవులు ఇస్తున్నారని హైకమాండ్‌ను విమర్శిస్తూ.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా హెచ్చరించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సీరియస్..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో గురువారం సమావేశమై మాట్లాడుతానని తెలిపారు.‘ మంత్రి పదవి కోసం తాను ఎవరి కాళ్లు మొక్కనని, తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని, తాను ప్రజల కోసం పనిచేసినప్పటికీ తనకు మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారంటూనే సీఎం రేవంత్‌రెడ్డిపైన విమర్శలు చేశారు.
దీంతో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో వివాదానికి రేకెత్తించాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని, ఇటువంటి అంశాలను పార్టీ హైకమాండ్ పరిష్కరిస్తుందని మల్లు రవి తెలిపారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.