calender_icon.png 7 August, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా సృష్టి మాయ!

07-08-2025 01:07:53 AM

  1.    80 మంది చిన్నారుల విక్రయం
  2. సీనియర్ డాక్టర్ లెటర్‌హెడ్‌తో పోర్జరీ
  3. సృష్టి కేసులో సంచలనం
  4. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న అక్రమాలు..
  5. తాజాగా మరో 8 మంది అరెస్ట్, మొత్తం 25 కు చేరిన సంఖ్య

హైదరాబాద్, సిటీబ్యూరో అగస్టు 6 (విజయక్రాంతి) : రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి పేరుతో సాగించిన ఈ దందాలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఏకంగా 80 మంది చిన్నారులను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు, సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రము ఖ గైనకాలజిస్ట్ పేరుతో నకిలీ లెటర్‌హెడ్‌లు సృష్టించి పోర్జరీకి పాల్పడినట్లు కూడా బట్టబయలైంది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 25కు చేరింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నమ్రతను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటి షన్ దాఖలు చేశారు.

80 మంది చిన్నారుల అమ్మకం

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై వచ్చిన ఆరోపణలతో దర్యాప్తు చేపట్టిన గోపాలపురం పోలీసులకు విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి. సరోగసీ ముసుగులో డాక్టర్ నమ్రత సుమారు 80 మంది పిల్లలను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని విచారణలో నమ్రత స్వయంగా అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

 వేర్వేరు ప్రాంతాల నుంచి ఏజెంట్ల ద్వారా డబ్బులిచ్చి పిల్లలను కొనుగోలు చేశామని, ఆ తర్వాత వారిని సంతానం లేని దంపతులకు లక్షల రూపాయలకు అమ్ముకున్నామని ఆమె ఒప్పుకున్నారు. అయితే ఆ ఏజెంట్ల వివరాలు మాత్రం తనకు తెలియవని చెప్పడంతో, ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా మూ లాలను శోధించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ 80 మంది పిల్లల తల్లిదం డ్రుల వివరాలు రాబట్టేందుకు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవడం అత్యంత కీలకమని పోలీసులు భావిస్తున్నారు. పిల్లల్ని అమ్మడం ద్వార నమ్రత కోట్లు సంపాదించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇలాఉం డగా, నమ్రతకు హైదరా బాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయని.. ఈ విషయంలో వివరాలు ఇవ్వాల్సిం దిగా రిజిస్ట్రేషన్ శాఖకు పోలీసులు లేఖ రాశారు.

ఫోర్జరీ బాగోతం

నమ్రత మోసాలు కేవలం సరోగసితోనే ఆగిపోలేదు.. ఏకంగా సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న సీనియర్ గైనకాలజిస్ట్ పేరును దుర్వినియోగం చేసింది. ఆ వైద్యురాలి లెటర్‌హెడ్‌ను ఫోర్జరీ చేసి, దానిపై రోగులకు మందులు, ఇంజక్షన్లు రాసిస్తూ మోసాలకు పాల్పడింది. తన లెటర్‌హెడ్‌ను నమ్రత వాడుతున్న విషయం తెలుసుకున్న సదరు వైద్యురాలు అవాక్కయ్యారు. తాను సృష్టి సెంటర్‌లో ఎన్నడూ పనిచేయలేదని, నమ్రతతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తూ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నమ్రతపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేశారు.

బీరూ, బిర్యానీ ఎర

నమ్రత నేర సామ్రాజ్యం ఎంత కిరాతకంగా సాగిందంటే, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల వద్ద ఉండే బిక్షగాళ్లకు బీరు, బిర్యానీ ఆశ చూపి, వారికి పోర్న్ వీడియోలు చూపించి వారి నుంచి వీర్యం సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిం ది. మరోవైపు, సంతానం కోసం వచ్చిన దం పతులను నిలువునా ముంచేసింది. 2009 లో వివాహమైన ఓ జంటను ఐవీఎఫ్ పేరు తో నమ్మించి, అది విఫలమైందని చెప్పి సరోగసి వైపు మళ్లించింది. రెండు దఫాలుగా రూ.27 లక్షలు వసూలు చేసింది. తీరా గడు వు ముగిశాక, సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ చనిపోయిందని చెప్పి చేతులెత్తేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీ సులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

బిగుస్తున్న ఉచ్చు.. 25 మంది అరెస్ట్

ఈ కేసులో ఇప్పటికే 17 మం దిని అరెస్ట్ చేసిన పోలీసులు, తాజా గా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 25కు చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సృష్టి సెంటర్‌కు హైదరాబాద్‌లోనే కాక, ఏపీ, ఒడిశా, కోల్‌కతాలలో కూడా బ్రాంచీలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 200 మందికి పైగా దంపతుల రికార్డులను స్వాధీనం చేసుకుని, వారిని సంప్రదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నమ్రత కస్టడీ పిటి షన్‌పై న్యాయస్థానం నిర్ణయం తర్వా త ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.