calender_icon.png 7 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కబ్జా

07-08-2025 01:04:15 AM

  1. ప్రభుత్వ భూమిలో ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ విలాసాలు
  2. విల్లాల కోసం ప్రభుత్వ భూమిలోనే అప్రోచ్ రోడ్డు
  3. పట్టించుకోని రెవెన్యూ అధికారులు
  4. వందల కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
  5. చర్చి గగిల్లాపూర్‌లో ‘ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్’ పేరుతో రియల్ దందా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ ముసుగులో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. పట్టా భూమిలో నిర్మాణానికి అనుమతులు పొంది, ఆ పత్రాలను అడ్డం పెట్టుకొని పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను, ప్రజా అవసరాలకు వినియోగపడే చెరువులను గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేస్తున్న భాగోతం వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలం, చర్చి గగిల్లాపూర్‌లో ‘ప్రణీత్ ప్రణవ్ గ్రూప్’ చేపట్టిన ‘ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్’ విల్లాల ప్రాజెక్ట్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ భూ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కబ్జా ఇలా..

చర్చి గగిల్లాపూర్‌లోని సర్వే నంబర్లు 2004/2, 214/1లలో తమకున్న పట్టా భూమిలో ఇండిపెండెంట్ విల్లాల నిర్మాణానికి ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ అనుమతులు పొందింది. అయితే ఈ పట్టా భూమిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్లు 214/1, 2134/1, 314/3లోని విలువైన ప్రభుత్వ భూముల్లోకి చొరబడి అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ఏళ్లనాటి మురుగునీటి కాలువ ‘చెయినేజీ కాలువ’ను సైతం పూడ్చివేసి, దానిపై ప్రహరీ గోడలు, విల్లాలకు సంబంధించిన ఇతర నిర్మాణాలు చేపట్టడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

అప్రోచ్ రోడ్డు మాయాజాలం..

విల్లాల ప్రాజెక్టులోకి ప్రవేశించడానికి ప్రధాన రహదారి అత్యంత కీలకం. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వే నంబర్ 214/1లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి, దాన్ని తమ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ అనుమతుల కోసం సమర్పించిన దస్తావేజుల్లో ఎక్కడా ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించిన సర్వే నంబర్‌ను పేర్కొనకపోవడం గమనార్హం. ప్రభుత్వ భూమిని తమ సొంత దారిగా మార్చుకొని, దాన్ని చూపించి విల్లాలను ఎలా అమ్ముతారు? ఇది పట్టపగలు చేస్తున్న దోపిడీ కాదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మౌనం అంగీకారమేనా?

తీవ్ర ఆరోపణలపై వివరణ కోరేందుకు ‘విజయక్రాంతి’ ప్రతినిధి ప్రణీత్ ప్రణవ్ యాజమాన్యాన్ని సంప్రదించగా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న తీవ్రమైన ఆరోపణలపై స్పందించకపోవడం, వాటిని పరోక్షం గా అంగీకరించినట్లేనని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. 

చట్టాల ఉల్లంఘన.. అధికారుల నిర్లక్ష్యం..

ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎన్‌క్రోమెంట్ యాక్ట్ 1905, తెలంగాణ రాష్ర్ట రెవెన్యూ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశించడం, నిర్మాణాలు చేపట్టడంపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, చర్చిగగిల్లాపూర్ విషయంలో అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని, వారి నిర్లక్ష్యం వెనుక ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, రెవెన్యూ శాఖలతో ఒక జాయింట్ సర్వే కమిటీని ఏర్పాటు చేసి, భూముల రికార్డులను, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.