07-08-2025 12:48:12 AM
దైవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాకాసి వరదలతో మరోసా రి ఉలిక్కిపడింది. సునామీ వచ్చిందా లేక సముద్రం ఏమైనా మీద పడిందా అన్న స్థాయిలో మేఘం గర్జించింది. ఆ గర్జనకు నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద.. వరదలా మారి ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీని పూర్తిగా కప్పేసింది. సుందరమైన ప్రదేశంగా పేరు పొందిన ధరాలీ ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది.
మంగళవారం ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తర కాశీ జిల్లా అల్లకల్లోలమైం ది. ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో మేఘ విస్ఫోటనంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద.. అతి వేగంగా ధరాలీ గ్రామం లోకి దూసుకొచ్చింది. దీంతో ధరాలీ గ్రామంలోని ఇండ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం ఐదుగురు మృతి చెం దగా.. వరదల్లో వంద మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది.
ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద పక్కనే ఉన్న సుక్కీ గ్రామాన్ని కూడా ముంచెత్తింది. వరదల్లో గల్లంతైన వారి గురించి క చ్చితమైన సమాచారం లేకపోవడంతో చాలా మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ప్రకోపాలు కొత్తేమీ కాదు.. కానీ వాతావరణంలో విపరీతమైన మార్పులు వాటి తీవ్రతను మ రింత పెంచుతున్నాయి.
మేఘాలు ఒక్కసారిగా బద్దలై వరదలు ఉప్పొంగ డం వంటివి ఇటీవల ఎక్కువైపోయాయి. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత శ్రేణులలో ఉండటంతో తరచూ భూకంపాలు, కొండచరియలు విరిగిపడటానికి ఆస్కారం ఎక్కువ. 2023లో ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుబాటే ఇందుకు ఉదాహరణ. సరిహద్దుల్లో తవ్వకాలు, ఇళ్లకు సమీపంలో మైనింగ్, వ్యర్థాలను నదుల్లో పారవేయడం లాంటి అశాస్త్రీయ పద్ధ తులు ఉపద్రవానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి.ముఖ్యంగా ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావడంతో రుతుపవన గాలులు హిమాలయ పర్వత శ్రేణులకు అడ్డుగా ఉంటాయి. దీంతో తేమతో నిండిన మేఘాలు ఒకేచోట పేరుకుని చల్లని వాతావారణం కారణంగా భారీ వర్షాలు కురుస్తుంటాయి.
ఇలా గంట నుంచి మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసే వర్షాలను క్లౌడ్ బరస్ట్ అంటారు. క్లౌడ్ బరస్ట్ వల్ల నదుల్లో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగి, ఆకస్మిక వరదలు వస్తాయి. ఈ వరదలు.. బురద, రాళ్లు, చెట్లను వెంటబెట్టుకొని వచ్చి భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ ఎలాంటి విలయం సృష్టిస్తుందో చెప్పడానికి 2013లో జరిగిన కేధార్‌నాథ్ విపత్తు మరో ఉదాహరణ. జూన్ 15న గాంధీ సరోవర్ వద్ద చోరాబరి నదీ పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది.
భారీ వరదలు మందాకిని కారణంగా 5 వేల నుంచి 6 వేల మంది మరణించగా.. నిరాశ్రయులైన లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. 2021లో రిషిగంగ విపత్తు ఉత్తరాఖండ్‌లో సంభవించిన మరో ఉపద్రవంగా పేర్కొనవచ్చు. ఫిబ్రవరి 7, 2021న నందాదేవీ సమీపంలో గ్లేసియర్ బద్దలు కావడంతో రిషిగంగా, దౌలిగంగా నదుల్లోకి వరద పోటెత్తింది. ఆ వరద నేరుగా కొండచరియలను చీల్చుకుంటూ రెండు ప్రధాన హైడ్రోపవర్ ప్రాజెక్టులు రిషిగంగ, తపోవన్ విష్ణుగడ్‌లను చుట్టుముట్టింది.
ఈ విపత్తులో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోగా.. వీరంతా ఆయా సైట్లలో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. వాతావరణ మార్పులు ఉత్తరాఖండ్ ప్రకృతి సహజసిద్ధమైన ప్రక్రియలను దెబ్బతీస్తూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల లాలూచీ వల్ల అవసరం లేకున్నా పుట్టుకొస్తున్న భారీ ప్రాజెక్టులు, వాటికోసం జరుగుతున్న పేలుళ్లు, మానవ కార్యకలాపాలు ఈ సున్నితమైన ప్రాంతాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసాన్ని అదుపులో పెట్టుకోకపోతే ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటుంది.