27-06-2025 02:00:31 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గితే, అధికారులు
రాజన్న సిరిసిల్ల: జూన్ 26 (విజయక్రాంతి); విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగామత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, విద్యార్థులు, పోలీస్ అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు.ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపచేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం మనందరిబాధ్యత - డ్రగ్స్కి నో చెప్పండి- ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకారడ్స్, నినాదాలు చేశారు.
డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్ విని యో గంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు.
విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.అనంతరం ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ పరిసరాలు, విద్యాలయాలు ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించనా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారాలని ఆకాంక్షించా రు.
యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలను కలెక్టర్, ఎస్పి తదితరులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులు అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఫంక్షన్ హాల్ ఆవర ణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సి.ఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నతేష్,మధుకర్, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.