26-07-2025 03:37:36 PM
తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి
మంచిర్యాల,(విజయక్రాంతి): పార్లమెంట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి శనివారం వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న 36 పార్టీల నుంచి 32 పార్టీలు బిసి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయనీ, దేశంలోని తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టడం లేదో బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ జనాభాలో 10 శాతం లేని అగ్రకులాలే దేశాన్ని, రాష్ట్రాన్ని 78 సంవత్సరాలుగా పాలిస్తున్నారనీ, 60 శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగా మారిందనీ, ఇదేనా ప్రజాస్వామ్యం, ఇదేనా సామాజిక న్యాయం అని వారు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంతా అని రాజ్యాంగం చెప్తుంటే ఈ అగ్రకులాలు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఇప్పటికైనా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.