25-12-2025 01:19:10 AM
న్యూఢిల్లీ, డిసెంబర్24: ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 12,015 కోట్ల అంచనాతో మెట్రో ఫేజ్-5 ఏ విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాజధానిలో మరో 13 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విస్తరణతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్ల మైలురాయిని దాటనుంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచు కుని ఈ ప్రాజెక్టును మూడు ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణలో భాగంగా మొత్తం 16 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్లను నిర్మించనున్నారు. ఇందులో పది స్టేషన్లు భూగర్భంలో ఉండగా, మూడు స్టేషన్లను ఎలివేటెడ్ పద్ధతిలో నిర్మిస్తారు. ముఖ్యంగా ఆర్‌కే ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు సుమారు 10 కిలోమీటర్ల పొడవైన కారిడార్ కీలకం కానుంది. దీని ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, కర్తవ్య భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాలకు మెట్రో సౌకర్యం మరింత మెరుగుపడుతుంది.
అలాగే విమానాశ్రయ ప్రాంతంలో ఏరోసిటీ నుంచి టెర్మినల్-1 వరకు కొత్త లైన్ రానుంది. మరోవైపు తుగ్లకాబాద్ నుంచి కాళింది కుంజ్ వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరించనున్నారు. ఈ విస్తరణతో మెట్రో సేవలు మరింత మందికి చేరువ కానున్నాయి. సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
దేశంలో మరో మూడు ఎయిర్‌లైన్స్
దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి చెక్ పడనుంది. ఇండిగో, ఎయిరిండి యా వంటి సంస్థల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఇచ్చింది. కేరళకు చెందిన అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్, శంఖ్ ఎయిర్ సంస్థలు త్వరలో రంగంలోకి దిగనున్నాయి. ఇది ప్రయాణికులకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. దీంతో దేశీయ విమాన ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంది.