03-11-2025 12:29:31 AM
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కదిలిన అధికారులు
ములకలపల్లి, నవంబర్ 2, (విజయక్రాంతి):ములకలపల్లి లోని గిరిజన ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యుత్తు,నీటి సమస్యలపై విద్యార్థులు చేసిన నిరసన, ఆందోళన పై అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గిరిజన ఏకలవ్య మోడల్ పాఠశాలలో నీళ్ళు లేవని అక్టోబర్ 31వ తేదీ శుక్రవారం విద్యార్థులు పాఠశాల ఆవరణలో నిరసనకు దిగి ఆందోళన నిర్వహించిన విషయం పాఠకులకు విధితమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు స్పందించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ అధికారులు చేంజ్ ఓవర్ స్విచ్ ను విజయవాడలో కొనుగోలు చేసి దీనిని ఆదివారం అమర్చడంతో నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించింది.అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నీటి సమస్య పరిష్కారం కోసం మరొక బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగినది. విద్యుత్తుకు సంబంధించి జగన్నాపురం విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పాఠశాలకు ప్రత్యేక లైన్ వేసే పనులను ప్రారంభించారు.
లైన్ ఏర్పాట్లు లో ఉన్న పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసి రెండు రోజుల్లో త్రీఫేస్ విద్యుత్ కనెక్షన్ అందజేస్తామని విద్యుత్ ఏఈ నరేష్ తెలిపారు.గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారిణి అరుణ కుమారి విద్యార్థులను విచారించి వారు తెలియజేసిన అంశాలకు సంబంధించి పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించి మెనూ ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.ఇకముందు ఇటువంటి పరిణామాలు,మంచినీటి సమస్య, మెనూ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఖమ్మం రీజియన్ గురుకులాల ప్రాంతీయ అధికారిణి అరుణ కుమారి తెలియజేశారు.