calender_icon.png 14 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిండి నీటి తరలింపు ఆపాలి

14-09-2025 12:47:55 AM

  1. లేకపోతే మరో ఉద్యమం తప్పదు
  2. మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 13 (విజయక్రాంతి):తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పాలమూరుకు గండి కొట్టనివ్వనని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 36 లక్షల ఎకరాల యోగ్యత గల పాలమూరు ప్రాంత పంట భూములకు రోజుకు రెండు టీఎంసీల చొప్పున వరద జలాలను అందించాలన్న లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు.

అలాంటి పాలమరుకు గండి కొట్టి ఏదుల నుంచి డిండి ప్రాంతం మీదుగా నల్గొండకు పాలమూరు నీటిని తీసుకువెళ్లాలని కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రాంత రైతుల పంట పొలాలను వినియోగించుకొని ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకుండా రోజుకు అర టీఎంసీ చొప్పున డిండి ప్రాంతానికి నీటిని తరలించేందుకు మళ్లీ పాలమూరు రైతుల పంట భూములను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

అందుకు నల్గొండ ప్రాంత ఇంజనీర్లు తెరవెనక కుట్ర చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిండి ఎదుల ప్రాజెక్టు కోసం జీవో విడుదల చేసిందన్నారు. దాన్ని నిలుపుదల చేసేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెరవెనక ఇంజనీర్ల కోసం ప్రత్యేకించి ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తనకు సమాచారం ఉందన్నారు.

24.7 లక్షల సాగు భూమి ఉన్న నల్గొండ ప్రాంతానికి మూసి, గోదావరి, ఎస్‌ఎల్బీసీ నుండి సుమారు 70% సాగునీరు అందుతుందన్నారు. కానీ కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, జూరాల వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ 36 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్న పాలమూరు ప్రాంతానికి కేవలం 7లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంద న్నారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని అన్ని లిఫ్టుల్లో పంపు మోటర్లు బిగించి ఉన్నాయని కేవలం 3.5 కి.మీ. ఓపెన్ కెనాల్ తవ్వకం పూర్తయితే పూర్తి స్థాయిలో కరువేనా ఉద్దండపూర్ వరకు కృష్ణ నీటితో పాలమూరు కళకళలాడుతుందన్నారు.

ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తున్న ఎందుకు పూర్తి చేయడం లేదో చెప్పాలన్నారు. అయినా ఈ ప్రాంత ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు సోయి లేకుండా ఉన్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించే లక్ష్యంగా పార్టీలకతీతంగా రాజకీయాలను పక్కనపెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని చేతులెత్తి ప్రాధేయపడ్డారు.

శ్రీశైలం నుంచి నేరుగా డిండి ప్రాంతానికి అర టీఎంసీ తరలించాలన్న ఉద్దేశంతో 2015లో 107 జీవో విడుదల చేసిందని ఆ ప్రకారంగా నీరు తీసుకెళ్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. కానీ పాలమూరు ప్రాంత ప్రయోజనం కోసం రూపొందించిన పాలమూరు ప్రాజెక్టుకు గండికొట్టి అక్రమంగా నీరు తరలించాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని నాగం స్పష్టం చేశారు.