01-01-2026 12:16:27 AM
రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) డిసెంబర్ 31 (విజయక్రాంతి): ప్రభుత్వ వసతి గృహాల నిర్వాహకులు నిర్వహణన పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో బుధవారం భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, జిల్లా కో ఆర్డినేటర్లు, ఎస్సి కార్పోరేషన్ ఈడీలతో వసతి గృహాలు నిర్వహణ, సౌకర్యాలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లోని విద్యార్థులను తమ పిల్లల్లాగా చూసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, విద్య, భోజనం, వైద్య సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతం, అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ ఫలితాల కోసం స్టడీ అవర్స్ తప్పనిసరిగా నిర్వహించాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపకూడదని, వసతి గృహాల్లోకి బయటి వ్యక్తులు రానీయకూడదని స్పష్టం చేశారు.
వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు ద్వారా ప్రతినెల వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి హాస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక పర్యవేక్షణ కోసం అధికారిని నియమించి విద్యార్థులతో మమేకమై డైట్, మెనూ, సంరక్షణ పాటించేలా చూడాలని సూచించారు. ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని, షీ-టీమ్ ద్వారా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని తనిఖీ చేశారు.
విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి మంత్రి ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు రాహుల్ శర్మ, స్నేహ శబరిష్, సత్య శారద, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఐటిడిఎ పీఓ చిత్రామిశ్రా, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్సి అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ సి.శ్రీధర్, ఎస్సి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ హన్మంతు నాయక్, గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ పోశం, మంత్రి ఓఎస్డీ విజయ్ కుమార్, పిఆర్వో అమృత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.