calender_icon.png 20 May, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

20-05-2025 12:53:35 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం మే 19 (విజయక్రాంతి)2024-25 విద్య సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో   సంబంధిత   శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు జరుగుతాయన్నారు. ఈసారి పరీక్షల్లో ఆదివారం కూడా పరీక్ష నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు  మొత్తం7635 మంది విద్యార్థులు హాజరు కాగా, 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్  రవాణా సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, పరిశుభ్రమైన వాతావరణం నెలకొనెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఎగ్జామ్ సెంటర్లలో నియమిస్తూ, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను  కలెక్టర్  ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో  జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి సిహెచ్ వెంకటేశ్వరరావు, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, డిప్యూటీ డిఎంహెచ్వో జయలక్ష్మి, పోలీస్ శాఖ నుండి ఎస్ బి ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాస్,  ట్రాన్స్ కో, పోస్టల్ శాఖ ఏ ఎస్ పి చిన్న యాకయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ అహ్మద్, జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి రమణారావు మరియు వివిధ శాఖల అధికారులు,  పాల్గొన్నారు.