08-01-2026 12:15:33 AM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 7, (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.
రహదారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు లఘు చిత్రాలను రూపొందించి సినిమా థియేటర్లలో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి నెలలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలు, శిక్షణా కార్యక్రమాలు, వాహనదారులకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలను వెంటనే గుర్తించి పూడ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.రహదారులపై గుంతలను పూడ్చే బాధ్యత సంబంధిత ప్రతి శాఖకూ ఉందని అన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఇందుకు అనుగుణంగా బ్లాక్ స్పాట్ల మ్యాప్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణంలో రైల్వే స్టేషన్ పరిసరాలు లక్ష్మీదేవిపల్లి మోర్ సూపర్ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
అలాగే కొత్తగూడెం పట్టణంలోని ఫుట్పాత్ల వెంట ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న చిరు వ్యాపారులను అనువైన ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తగిన స్థలాన్ని గుర్తించాలని అన్నారు. భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను మరమ్మత్తులు చేసి సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్ అండ్ బీ, వైద్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుని చట్ట ప్రకారం జైలు శిక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.