30-10-2025 04:43:36 PM
జంక్షన్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ కార్యాచరణ అమలు..
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నిర్వహించిన సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ, డి.సి.పి కరుణాకర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి.వనజ లతో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, ఎన్.టి.పిసి, గోదావరిఖని 1-టౌన్ లో అధికంగా ప్రమాదాలు జరిగే 28 హాట్ స్పాట్ లను గుర్తించి రూ. 27 లక్షలతో ఎల్.ఈ.డి. హై మాస్ లైట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బసంత్ నగర్ లో మరో 2 చోట్ల రూ. 5 లక్షలతో హై మాస్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణంలో రూ. 15 లక్షలతో నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు పై వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అవసరమైన మేర స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయాలని, రోడ్డుపై పశువులు విడిచిపెట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ రూ. 10 వేల రూపాయల జరిమానా విధించాలని, పశువులను గోశాలలకు తరలించాలని, జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, హెచ్.కే.ఆర్ సిబ్బంది మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ పెద్దపల్లి పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన మేర రొడ్డు విస్తరణ కు చర్యలు తీసుకోవాలని, రొడ్డు విస్తరణ సజావుగా జరిగేలా మున్సిపల్ అధికారులు చొరవతీసుకుని సంబంధిత వీధి వ్యాపారులను ఒప్పించాలని అన్నారు.
డివైడర్ లను పరిశీలించి అక్కడ ప్రమాదాల జర్గకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, రామగుండం నగరంలో అవసరమైన చోట సిసి కేమేరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం జరిగిన ప్రమాదాలపై రిపోర్ట్ అందించాలని, పట్టణ ప్రాంతాలలో రోడ్డు స్ట్రిప్స్ , రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేయాలన్నారు. టౌన్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం యూ టర్న్ ల పై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని, రోడ్డు భద్రత ప్రమాణాల పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో అధికంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఉండాలన్నారు. హిట్ అండ్ కేసుల బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని కలెక్టర్ పోలీస్ అధికారులకు సూచించారు.
జిల్లాలోని రహదారి పక్కన ఉన్న పిచ్చి మొక్కల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని, లారీలు, ట్రాక్టర్ లు, భారీ వాహనాలు, కార్లకు ముందు వెనుక తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం తాగి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ధరించడం మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం వంటివి ప్రమాదకరమని, చట్ట ప్రకారం నేరమని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, ఈఈ ఆర్ అండ్ బి భావ్ సింగ్ , పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, ఏసీపీలు రమేష్, కృష్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు బండి ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి, సిఐ, ఎస్ఐ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.