calender_icon.png 7 August, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల కట్టడికి పటిష్ఠ చర్యలు

07-08-2025 01:31:02 AM

అధికారులకు డీజీపీ జితేందర్ దిశానిర్దేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): రాష్ర్టంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని డీజీపీ డాక్టర్ జితేందర్, ఐపీఎస్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక, వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశం జరిగింది.

సీఐడీ ఏడీజీ చారుసిన్హా నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో డీజీపీ జితేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని నేరాల సరళిని సమీక్షించారు. సమావేశంలో ఏడీజీ మహేశ్ భగవత్, ఏడీజీ అనిల్ కుమార్, ఐజీ ఎం రమేశ్,  ఎంజెడ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రేంజ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, రాష్ర్టంలో నేరాల సరళి, శాంతిభద్రతల పరిస్థితి, కీలక కేసుల దర్యాప్తు పురోగతి, శారీరక, ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలు-చిన్నారులపై జరిగిన నేరాలకు సంబంధించిన నివేదికను ఏడీజీ సీఐడీ, డీజీపీకి సమర్పించారు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో శాంతిభద్ర తలను సమర్థవంతంగా పరిరక్షించినందుకు అధికారులందర్ని డీజీపీ అభినందించారు. చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, షీ టీమ్స్, ఏహెటీయూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్, భరోసా కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు.