06-01-2026 05:29:46 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మధ్యాహ్నం భోజనం వికటించి ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటన నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో గల బాలుర ప్రాథమిక పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేసిన ఎనిమిది మంది విద్యార్థులు కడుపునొప్పిగా ఉందని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి తులసికి చెప్పారు.
ఆమె వెంటనే స్థానికుల సహాయంతో విద్యార్థులను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్నం భోజనం నమోనాలను ప్రయోగశాలకు పంపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలియజేశారు.