calender_icon.png 13 August, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్‌మిల్లర్ల చేతివాటం

13-08-2025 12:00:00 AM

  1. సీఎంఆర్ బియ్యంలో భారీ స్కామ్.! 
  2. 2.75 లక్షల  క్వింటాల బియ్యం మాయం 
  3. చర్యలకు వెనకడుగు వేస్తోన్న అధికారులు
  4. విచారణ కమిటీ కన్వీనర్గా డీఎస్‌ఓ    

నల్లగొండ  టౌన్, ఆగస్టు 12 : నల్లగొండ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పలువురు మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను గుర్తించినా రాజకీయనాయకుల ఒత్తిళ్ల వల్ల అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్ల పై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. మిల్లర్లు క్వింటా ధాన్యానికి 67 కిలోల బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ చొప్పున భారత ఆహార సంస్థ ఎఫ్సీఐకి తిరిగి ఇవ్వాలి.

కానీ కొందరు నేరుగా వడ్లనే అమ్మేసుకుంటే మరికొందరు బియ్యంగా మార్చి పక్కదారి పట్టిస్తున్నారు. దీనిపై అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో నామమాత్రంగా తనిఖీలు జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్ ఇవ్వడానికి ఆరు నెలల గడువు ఉంటుంది. చాలామంది మిల్లర్లు వివిధ కారణాలు చూపిస్తూ రెండు సీజన్ల(ఏడాది) తర్వాతే ఇస్తున్నారు.

మరికొందరు ఏడాదిన్నర, రెండేళ్ల వరకు ఇవ్వడం లేదు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని   సూర్యాపేట, నల్గొండ, కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల రైస్మిల్లర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి లెక్కలు సర్దుబాటు చేస్తున్నట్లు సమాచారం. ఇంకొందరు మిల్లర్లు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యాన్ని డీలర్లు, దళారుల ద్వారా సేకరించి రీసైక్లింగ్ చేసి కలుపుతున్నారని వినికిడి.

వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఏ మిల్లర్ వద్ద ఎంత ధాన్యం ఉందనేది ఎవరికీ తెలియదు. సీఎంఆర్ ఎంత ఇచ్చారు, ఇంకా ఎంత రావాల్సి ఉందన్న వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. కానీ అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో నామమాత్రంగా తనిఖీలు జరిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆరు రైసు మిల్లులో అక్రమాలు.. 

జిల్లాలోని  నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలలోని 6 మిల్లులలో  భారీగా అక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలానికి చెందిన ఓ మిల్లుకు 2022-23 యాసంగి సీజన్ కు సంబంధించి సీఎంఆర్ కోసం 1,18,132 క్వింటాళ్ల ధాన్యం ఇవ్వగా, 30,450 క్వింటాళ్ల బియ్యం ఇచ్చింది. అయితే గతేడాది ఆ మిల్లుల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వేలం వేయడంతో 13,789 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుదారుడు తీసుకెళ్లారు.

ఇంకా మిల్లులో 59,539 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉన్నా అక్కడ లేనట్లు తెలిసింది. నల్లగొండకు చెందిన ఓ మిల్లుకు కేటాయింపు, ఇచ్చింది పోగా, ఇంకా 3,17,492 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో ఉండాల్సి ఉంది. అయితే అక్కడ 2,39,381 క్వింటాళ్లే ఉందని, 78,110 క్వింటాళ్ల ధాన్యం మాయం అయిందన్న ఆరోపణలు ఉన్నాయి. మునుగోడుకు చెందిన ఓ మిల్లులోనూ 4,500 క్వింటాళ్ల ధాన్యం, నల్లగొండలోని మరో మిల్లులో ఉండాల్సిన 34,622 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు  పక్కదారి పట్టించారని సమాచారం.

నల్లగొండకు చెందిన మరో మిల్లులోనూ 1,59,803 క్వింటాళ్లు, మరో మిల్లులో 79,133 క్వింటాళ్ల ధాన్యం ఉండాల్సి ఉన్నా, దానిని ఆయా మిల్లులు పక్కదారి పట్టించినట్లు అధికారులకు   ఫిర్యాదులు అందాయి. రైస్ మిల్లులో  మాయమైన 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యం మిల్లుల యజమానులు   కాకినాడకు తరలించినట్లు తెలుస్తుంది.

బియ్యం అమ్ముకుంటున్న మిల్లులు..

జిల్లాలో పలు మిల్లులు ఇప్పటికే పీడీఎస్ బియ్యం దందా చేస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుంటు న్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా సంబంధిత అధికారులు మిల్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వారి అండదండలతోనే 2022-23 నుంచి 2024-25 యాసంగి సీజన్ వరకు ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకపోగా, అందులో కొంత వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ధాన్యాన్ని కూడా అప్పగించకుండా, డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రూ. కోట్లలో నష్టం చేకూర్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ధాన్యం అక్రమాలపై విచారణ కమిటీ..

జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు చెందిన మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వలేదు. ఆరుగురు మిల్లర్లు 4.15 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి సంబంధించి 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంపై విచారణ చేయించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.  ఐదుగురు సభ్యులతో విచారణకు కమిటీ వేశారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కన్వీనర్ గా నియమించారు.