07-11-2025 12:00:00 AM
మొయినాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులంతా ప్రస్తుతం అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైందని ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సైబర్ క్రైమ్స్, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సీఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మోయినాబాద్ మండలంలోని హిమాయత్ సాగర్ చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్స్, మాదకాద్రవ్యాల వినియోగంపై సీఐ పవన్ కుమార్ రెడ్డి, సెక్టార్ ఎస్‌ఐ కిషన్ సింగ్, ఎస్‌ఐ నాయీముద్దీన్ లు అవగాహన కల్పించారు.
సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెడు మార్గాలను ఎంచుకొని ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని వారు హెచ్చరించారు.
సైబర్ క్రైమ్ నుండి రక్షణ పొందడానికి విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు, సోషల్ మీడియా వినియోగంలో భద్రతా చర్యలు, మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు ఆర్థిక నష్టాలను వివరించి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు.యువత మంచి అలవాట్లు అలవర్చుకొని సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని వారికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.