26-07-2025 08:12:29 PM
కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల,(విజయక్రాంతి): ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులన్నీ సమకూర్చాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం కేటిదొడ్డి మండలం పూటన్ పల్లి గ్రామంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, వసతుల స్థితిగతులపై కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.విద్యార్థుల భద్రత, పరిశుభ్రత,ఆరోగ్యం విషయంలో రాజీ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు సూచించారు.ప్రతి తరగతిలో విద్యార్థులకు పాఠాలు స్పష్టంగా అర్థమయ్యేలా విద్యను బోధించాలనీ, భోజనం నాణ్యతపై రాజీ లేకుండా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యతోపాటు క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని, పాఠశాల పరిసర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
విద్యార్థుల్లో శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని,తరచూ ముఖాముఖి సంభాషణల ద్వారా వారి సమస్యలు తెలుసుకొని, ప్రోత్సహించే విధంగా ముందుండాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, పాఠశాలలో అందుతున్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు నిరంతరం కష్టపడి చదివి మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్ నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం పూర్తిగా అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.