calender_icon.png 19 July, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిలు స్వీయ రక్షణపై దృష్టి సారించాలి

19-07-2025 12:18:04 AM

- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన 

- జిల్లాలో తొలిసారిగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ జ్వాల’కు శ్రీకారం

అదిలాబాద్, జూలై 18 (విజయక్రాంతి): విద్యార్థినిలు స్వీయ రక్షణపై దృష్టి సారించాలని, ఆపద సమయంలో ఆదుకునేలా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్వీయ రక్షణనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థినిలకు ప్రత్యేకంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో కరాటే శిక్షణ తరగతులను శుక్రవారం నుండి ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇందులో భాగంగానే స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల ల్లో మొట్ట మొదటిసారిగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆపరేషన్ జ్వాల పేరుతో శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టారు. కరాటే శిక్షణ తరగతులను ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు కరాటే అధ్యాపకుల సహకారంచే శిక్షణను అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక గంట సమయం మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఉండనున్నట్లు, దీనికి సహకరించిన జిల్లా విద్యాశాఖ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

జ్వాలా ముఖ్య ఉద్దేశం విద్యార్థులలో చిన్నతనం నుండి ఆత్మస్థుర్యైన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం తమ వంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టిందని, దీని ద్వారా మహిళా విద్యార్థుల్లో, చిన్నారులలో ఆపద సమయంలో స్వీయ రక్షణతో తమను తాము కాపాడుకునే ధైర్యాన్ని కలిగి ఉంటారని తెలిపారు. మహిళలకు ఎల్లవేళలా జిల్లా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఎలాంటి ఆపద సమయంలోనైనా డయల్ 100 లేదా షీ టీం బృందాన్ని సంప్రదించాలని సూచించారు. మహిళల పట్ల జరుగు నేరాల ను తగ్గించడానికి జిల్లాలో వినూత్నంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, కళాశాల ప్రధానోపాధ్యాయులు, పట్టణ సీఐ లు, కరాటే శిక్షకులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.