19-07-2025 12:18:36 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జులై 18 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన ట్రంక్ లైన్ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న ట్రంక్ లైన్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏటా వర్షాకాలంలో వనస్థలిపురం, హస్తినపురం డివిజన్లలో పలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయన్నారు.
ట్రంక్ లైన్ నిర్మాణం పూర్తయితే ఎన్నో ఏండ్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. గతంలో ట్రంక్ లైన్ నిర్మాణానికి దాదాపు రూ, 2 కోట్లు మంజూరు చేశామన్నారు. నిధులు సరిపోకపోవడంతో అదనపు నిధుల కోసం అధికారులతో పలుసార్లు చర్చలు జరిపి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ట్రంక్ లైన్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తయితే క్రిస్టియన్ కాలనీ, రాజీరెడ్డి కాలనీ, హస్తినపురం ఈస్ట్, న్యూ వెంకటరమణ కాలనీ, శ్రీ వెంకటరమణ కాలనీ, అనురాధ కాలనీ, ఓంకార్ నగర్ ఇతర కాలనీవాసులకు వరదనీటి సమస్య నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుందన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ హస్తినాపురం, ఎల్బీనగర్ డివిజన్ల అధ్యక్షులు ఆందోజు సత్యంచారి, రవిముదిరాజ్, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ మాజీ ధర్మకర్త ఛాతిరి మధుసాగర్‌పాల్గొన్నారు.