calender_icon.png 7 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజ్ఞాన్స్ చాన్స్‌లర్‌గా సుబ్బారావు

07-11-2025 12:00:00 AM

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): విజ్ఞాన్స్ యూనివర్సిటీ నూతన చాన్స్‌లర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త, అంతరిక్ష రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్ పావులూరి సుబ్బారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన హైద రాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్పేస్ అకాడమీ అధ్య క్షుడు, ఉత్తరప్రదేశ్ ఎకనామిక్ కౌన్సిల్ సభ్యు డు వంటి పలు కీలక హోదాలలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోవాడ గ్రామంలోని సంప్రదాయ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ సుబ్బారావు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, కృషి, విద్యాపట్ల ఆసక్తితో ఎదిగి, ఉన్నత విద్య అనంతరం ఇస్రోలో 15 సంవత్సరాలు శాస్త్రవేత్తగా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ పావులూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ‘విశ్వవిద్యాలయాలు కేవలం విద్యాపరమైనవిగా మాత్రమే కాక, పరిశ్రమాత్మక దృక్ప థం కలిగినవిగా కూడా ఉండాలన్నారు.

విజ్ఞాన్స్ యూనివర్సిటీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థాయికి చేర్చడం నా లక్ష్యం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాల పెంపు, విలువాధారిత విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాను. విద్యా విలువలు, పరిపాలన పారదర్శకత, పరిశోధన ప్రోత్సాహం, విద్యార్థుల అభివృద్ధి అనే నాలుగు స్తంభాలపై యూనివర్సిటీ ఎదుగుదల సాధిస్తాం.‘ అని అన్నారు.

కార్యక్ర మం లో విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, మాజీ డీజీపీ, విజ్ఞాన్స్ వర్సిటీ అడ్వైజర్ డాక్టర్ మాలకొండయ్య, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దిరిశాల విజయరాము, డీన్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు.