30-10-2025 12:57:53 AM
 
							నీటమునిగిన బస్టాండ్, దుకాణాలు
హైవే నిర్మాణంలో లోపాలతో మరింత పెరిగిన ముప్పు
ఊసేలేని కట్టుకాల్వ డైవర్షన్
ప్రతి ఏటా మునిగే పట్టణం, పట్టించుకోని పాలకులు
హుస్నాబాద్, అక్టోబర్ 29 : మొంథా తుపాను సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ వరదలతో హుస్నాబాద్ పట్టణంలో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ప్రతి ఏటా వానకాలం, తుపానులు వచ్చినప్పుడల్లా ఎదురవుతున్న ఈ దయనీయ పరి స్థితికి శాశ్వత పరిష్కారం చూపడంలో పాలకులు, అధికారులు ఘోరంగా విఫలమయ్యా రన్న విమర్శలు వస్తున్నాయి.
హుస్నాబాద్ కు వరద ముంపు ముప్పు తప్పడంలేదు. రెం డు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణం గా ఇండ్లలోకి వరద నీరు చేరింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా కురుస్తు న్న వానతో మెయిన్ రోడ్డులోని దుకాణాలలోకి నీరు చేరింది. ఇక్కడ హైవే నిర్మాణ పనులు నాణ్యత లేకుండా, ప్రజల అవసరాలను పూర్తిగా విస్మరించి చేపట్టడంతోనే స మస్య మరింత పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకుండా, రోడ్డు వెడల్పును పెంచకుండా నిర్మాణం జరుగుతుండడంతోనే మునుపటి సమస్య ఇంకా పెద్దగా మా రుతోందంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో భారీ వర్షాలతో వరదల సమయంలో పట్టణం ముంపునకు గురయ్యే ప్ర మాదం ఉందంటున్నారు. పోతారం(ఎస్) వైపు నుంచి వచ్చే వరద నీటిని మళ్లించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది.
పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోగా మెయిన్ రోడ్డు, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా మోకాళ్లలోతు నీరు నిలిచిపోవడం సాధారణంగా మారింది. పట్టణంలోని శివాజీనగర్, సాయినగర్, నాగా రం, హనుమకొండ రోడ్డు, మల్లెచెట్టుచౌరస్తా, హనుమాన్ నగర్, సాయినగర్ కాలనీ, స్నేహనగర్, వినాయకనగర్, టీచర్స్ కాలనీల్లో ఇండ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరి తీవ్ర నష్టాన్ని చేకూర్చుతోంది.
కట్టు కాల్వ వరదతో సమస్య
పోతారం (ఎస్) సమీపంలోని కట్టుకాల్వ ఉప్పొం గడంతో హుస్నాబాద్ పట్టణానికి ముంపు సమస్య ఏర్పడింది. గతంలో తీగలకుంట స్థానంలో వ్యవసాయమార్కెట్ యా ర్డు నిర్మించడంతో పాటు కుంట పరిధిలో ఇండ్ల నిర్మాణాలు జరగడం వరద ముంపునకు కారణమవుతోంది. ప్రతీఏటా వానకా లంలో కట్టుకాల్వ ఉప్పొంగడంతో హుస్నాబాద్ మునిగిన సంఘటనలు జరుగుతున్నా వరద మళ్లింపు చర్యలు తీసుకోవడంలేదు.
గతంలో కట్టుకాల్వ నుంచి వచ్చే నీరు హు స్నాబాద్ పట్టణ శివార్లలోని తీగలకుంటలోకి చేరేది. అక్కడి నుంచి పటేల్ కుంట మీదుగా కొత్తచెరువులోకి నీరు వెళ్లేది. అయి తే తీగలకుంట, పటేల్ కుంటల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు వెలియడంతో హుస్నాబాద్ వరద ముంపునకు గురవుతోంది.
ముంపు కేంద్రంగా హుస్నాబాద్
పట్టణ నడిబొడ్డున ఉన్న మెయిన్ రోడ్డు, బస్టాండ్ మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయాయి. బస్టాండ్లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు గంటల తరబడి అక్కడే నిలిచిపోయారు. అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా పరిసర ప్రాంతాలు సహా అనేక లోతట్టు కాలనీలలోని ఇండ్లలోకి మురుగు, వరద నీరు చేరింది. ప్రజలు తమ సామగ్రిని పైకి తరలించుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతి ఏటా ఇదే దుస్థితి ఎదురవుతున్నప్పటికీ, శాశ్వత పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. పట్టణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ప్రధాన ముంపు కారణం. ఉన్న కాలువలు కూడా పూడికతో నిండిపోయి వరద నీటిని తరలించలేక వెనక్కి తన్నుకు వస్తున్నాయి.
ముంపు నివారణ కోసం గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయి? వరదలు రాకముందే వాగులు, కాలువలలో పూడిక తీయడంలో మున్సిపల్ యంత్రాంగం ఎందుకు అలసత్వం వహించింది? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొం థా తుపాను కష్టాలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు, పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే వరద నష్టాన్ని అంచనా వేసి బాధితులను ఆదుకోవడంతో పాటు, హుస్నాబాద్లో పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
* పునరావాస కేంద్రం
పరిస్థితి చేయి దాటడంతో మున్సిపల్ అ ధికారులు మొక్కుబడిగా పునరావాస కేం ద్రాన్ని ఏర్పాటు చేశారు. శిధిలావస్థలో కూ లిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారు పునరావాస కేంద్రానికి రావాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు.
వరద బాధితులు మున్సిపల్ ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్ లో కంట్రోల్ రూమ్( హెల్ప్ డెస్క్) ను సంప్రదించవచ్చన్నారు. బాధితులు హెల్ప్ డెస్క్ నంబర్లు 7793911994, 733734 7611కు ఫోన్ చేయవచ్చన్నారు. అయితే, నంబర్ల నుంచి రెస్పాన్స్ లేదని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అన్నదాతకు అంతులేని నష్టం : తడిసిన వడ్లు, మక్కలు
కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్ల క్ష్యం మరోసారి రైతుల పాలిట శాపంగా మారింది. వేలాది క్వింటాళ్ల వడ్లు, మక్కలు మొంథా తుపాను ధాటికి పూర్తిగా తడిసిముద్దయ్యాయి. పంటను కష్టపడి పండించి, కేంద్రాలకు తరలించిన రైతులు... వడ్ల రాశు లు నీటిలో కొట్టుకుపోతుండగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. తరుగు పేరుతో ఇప్పటికే నష్టపోతున్న తమకు, ఈ వరద నష్టం తీరని దెబ్బ అని వారు ఆవేదన చెం దుతున్నారు.
తక్షణమే నష్టాన్ని అంచనా వేసి క్వింటాలుకు రూ.500 బోనస్ కలిపి పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తు న్నారు. నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుతో పాటు పలు ప్రధాన జలాశయా లు మత్తడి దూకుతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలకు గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది.మోయతుమ్మెద వాగు, ఇతర వాగు లు ఉప్పొంగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.