16-05-2025 12:41:08 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): జిల్లాలోని సుమారు 500 మంది వలస కార్మికుల పిల్లలకు ప్రత్యేక పాఠశాలల్లో విజయవంతంగా విద్యాబోధన పూర్తి చేయనున్నామని, కార్మికుల పిల్లలందరినీ చదువు వైపు ఆకర్షించామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక తరగతుల ద్వారా విద్యా బోధన చేయాలని నిర్ణయించామని అన్నారు.
ఎంపిక చేసిన 16 పాఠశాలల్లో సుమారు 500 మంది విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా గత ఫిబ్రవరి మొదటి వారం నుండి బోధిస్తున్నామని అన్నారు. ఇటుక బట్టి యజమానుల సహకారంతో వీరికి కావలసిన రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని, యూనిఫామ్ అందించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి అవసరమైన వ్యాక్సిన్ ఇప్పించామని అన్నారు. డెంటిస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయించామని చెప్పారు.
ఒరిస్సా కార్మికుల పిల్లల కోసం ఒరిస్సా నుండి పుస్తకాలు తెప్పించి ఇచ్చామని అన్నారు. బ్యాగు స్టేషనరీ, పుస్తకాలు అందజేశామని తెలిపారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం అందజేశామని అన్నారు. అనంతరం యజమానులకు సర్టిఫికెట్ అందజేశారు. ఉపాధ్యాయులను సన్మానించారు. వలస కార్మికుల పాఠశాల పిల్లల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, గంగాధర మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఇటుక బట్టి యజమానుల సంఘం అధ్యక్షులు హరిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.
జింకల పార్క్ సందర్శన
వలస కార్మికుల పిల్లలతో నిర్వహించిన సమావేశం అనంతరం వారిని విద్యా శాఖ అధికారులు జింకల పార్కు, ఉజ్వల పార్క్ సందర్శనకు తీసుకెళ్లారు. పిల్లలు ఉత్సాహంతో పార్కులో ఉల్లాసంగా గడిపారు.