07-12-2025 12:17:08 AM
ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె, కొంత విరామం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజాచిత్రం ‘ఈషా’. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తోపాటు త్రిగుణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. హెబ్బాపటేల్ కథానాయిక.
సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్న ఈ చిత్రానికి టాలీవుడ్ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తున్న ఈ చిత్ర విశేషాలను సమర్పకుడు దామోదర ప్రసాద్ పాత్రికేయులతో పంచుకున్నారు. “నిర్మాతగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. నా గత సినిమా ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ ఆశించినంతగా ఆదరణ పొందలేదు. కొందరు టైటిల్ బ్యాడ్ అని చెప్పారు. అయితే మంచి కథల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం.
ఆ టైమ్‌లో డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె ‘ఈషా’ గురించి చెప్పారు. కథ ఆసక్తికరంగా అనిపించి చేశాను. ఇండస్ట్రీలో కష్టపడి, ప్యాషన్ ఉన్న దర్శకులంతా ఫేమ్ కాలేరు. డైరెక్టర్ శ్రీనివాస్ మన్నెకు కూడా తగినంత పేరు రాలేదని నా నమ్మకం. కానీ, ఆయన విజన్‌ను నేను నమ్మాను. సినిమాను బాగా తెరకెక్కించాడు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ ఫీల్‌తో బయటకు వస్తారు. ఇలాంటి జానర్‌కు, క్యారెక్టర్‌కు సెట్ అయ్యే నటీనటులు లేకుంటే బెడిసికొడుతుంది. ‘ఈషా’లో మెయిన్ లీడ్ అంతా ఆకట్టుకుంటారు. త్రిగుణ్, హెబ్బాకు ఇటీవల తగినంత ఫేమ్ దక్కలేదు. ఈ సినిమాతో వారికి మంచి గుర్తింపు వస్తుంది. హీరో అఖిల్‌కు ‘రాజు వెడ్స్ రాంబాయి’తో వచ్చిన సక్సెస్ మా సినిమాకు కూడా ఉపయోగపడుతుంది” అన్నారు.