13-05-2025 01:12:38 AM
కరీంనగర్, మే 12 (విజయక్రాంతి): శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) బడిబాట పట్టనుంది. సుడా అంటే లే అవుట్లు, అనుమతుల వరకే పనిచేస్తుందని ప్రజలకు తెలుసు. సుడా అంటే ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుంటుందని నిరూపించే ప్రయత్నం సుడా చైర్మన్ కోమటరెడ్డి నరేందర్ రెడ్డి చేపట్టారు.
బుధవారం నుండి బడులు ప్రారంభమయ్యే జూన్ 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా కార్యక్రమాన్ని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపట్టాలని నిర్ణయించారు. పదవ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి వాటిలో మరిన్ని మౌళిక వసతులు కల్పించడంతోపాటు విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ముందుకు కదలాలని నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, ఉపాద్యాయుల పనితీరును ప్రజలకు వివరిస్తూ ఆయా గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాస్వాములను చేస్తూ విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారంచుట్టిన నరేందర్ రెడ్డి సుడా అంటే కేవలం లే అవుట్లు, అనుమతులే కాదు ప్రజోపయోగ కార్యక్రమాలకు కూడా ముందుంటుందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు.
బడిబాట అనంతరం వర్షాకాలం ప్రారంభం కాగానే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా భుజాన వేసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అధికార పార్టీ నుండి ఎమ్మెల్యే లేరు. ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కార్యక్రమాలు చేపట్టేందుకు హోదాగల నాయకులలో ఒక్క నరేందర్ రెడ్డే ప్రస్తుతం సుడా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తనకున్న పదవికి న్యాయం చేసేవిధంగా పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టే దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.