18-08-2025 12:25:25 AM
ఆలేరు, ఆగస్టు 17 (విజయ క్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సాయిగూడెం గ్రామానికి చెందిన సామాజిక సేవ కార్యకర్త గంగాధరి సుధీర్ కుమార్ కు జాతీయ సోషల్ సామ్రాట్ పురస్కారం లభించింది. సామాజిక సేవలు అందించినందుకు గాను ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.
హైదరాబాదులోని రవీంద్ర భారతి లో ఆదివారం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి, సీనియర్ ఆర్టిస్ట్ బాబు మోహన్,మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఇటికాల పురుషోత్తం వైస్ చైర్మన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేతుల మీదుగా శాలువాతో సన్మానం పొంది, జాతీయ సోషల్ సామ్రాట్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డు ప్రధానం చేశారని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరిచేందుకు ఈ అవార్డు ఉత్తేజ పరుస్తుందని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ శ్రీనివాసరాజు, రాష్ర్ట మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.